Tuesday, November 26, 2024

స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 300 మంది మృతి చెందగా..900 మందికిపైగా గాయపడ్డారని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాద స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలించి, సహాయక చర్యల గురించి ఆరా తీసిన అనంతరం అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెద్ద విషాదకరమైన ప్రమాదం. రైల్వే, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నాయి. సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సేవ‌లు గాయ‌ప‌డిన వారికి అందిస్తున్నాం.. మ‌రింత మెరుగైన సేవ‌ల‌కు అవ‌స‌ర‌మైతే వారిని విమానాల‌లో కార్పొరేట్ స్థాయి హాస్ప‌ట‌ల్స్ ఉన్న న‌గ‌రాల‌కు త‌ర‌లిస్తాం… ఈ ప్రమాదంపై వివరణాత్మక ఉన్నత స్థాయి విచారణ చేప‌డుతున్నాం. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారు’’ అని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టి రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లపై ఉందని తెలిపారు. ఇప్పటికే బోగీల‌లో చిక్కుకున్న వారంద‌రని వెలికి తీశామ‌ని, వారి వివ‌రాల‌ను సేక‌రించి వారి బంధువుల‌కు స‌మాచారం ఇస్తున్నామ‌న్నారు.. క్ష‌త‌గాత్రుల బంధువుల‌ను ఇక్క‌డ‌కు ర‌ప్పించేందుకు ఆయా ప్రాంతాల అధికారులు కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు..కాగా, జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి వచ్చిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభిస్తామని చెప్పారు.


ఇదిలా ఉంటే.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్కడే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఘటన స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులు వారికి వివరించారు. ఇక,రైలు ప్రమాదంలో నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement