Saturday, November 23, 2024

కొత్త రైల్వే ప్రాజెక్టులపై ఫోకస్‌.. ఏపీ, తెలంగాణలో నూతన స్టేషన్ల నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొత్త రైల్వే ప్రాజెక్టులపై ద.మ.రైల్వే దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మధ్య దూరం తగ్గేలా కేంద్రం ఆమోదం తెలిపిన నూతన రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక మార్గాలైన గుంటూరు-బీబీనగర్‌, డోన్‌-మహబూబ్‌నగర్‌ మార్గంలో డబ్లింగ్‌ పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో తెలంగాణలోని వివిధ రూట్లలో 433.82 కి.మీ.ల నూతన రైల్వే లైన్లను నిర్మించనుంది.

గుంటూరు-బీబీనగర్‌ మార్గంలో మొత్తం 239 కి.మీ.ల పొడవైన మార్గాన్ని రూ.3,238 కోట్ల వ్యయంతో నిర్మించనుంది. దీని ద్వారా హైదరాబాద్‌-చెన్నై నగరాల మధ్య 76 కి.మీ.ల మేర దూరం తగ్గనుంది. ఇదే మార్గంలోని మరో ముఖ్యమైన జంక్షన్‌ విజయవాడ మధ్య కూడా దూరం తగ్గనుంది. దీంతో హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై నగరాల రైళ్ల వేగం పెరగడంతో పాటు గూడ్సు రవాణాకు కూడా ప్రయోజనం చేకూరనుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రూట్లలో నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణంలో భాగంగా విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్‌ మీదుగా నెర్గుండి(కటక్‌) వరకు మొత్తం 417.6 కి.మీ.ల మేర రూ.5,618,26 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనుంది. దీంతో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను కలుపుతూ రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు నడపడానికి కూడా ద.మ.రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం నడిపేందుకు నిర్ణయించింది.

ఈ రూట్లో సర్వే నిర్వహించడానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ లైన్‌ నిర్మాణం పూర్తయితే, ఏపీలోని ముఖ్య పట్టణమైన విశాఖపట్టణం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. అలాగే, విశాఖపట్టణం నుంచి కాచీగూడ మీదుగా కర్నూలుకు మరో సూపర్‌ ఫాస్ట్‌ రైలును ప్రవేశపెట్టడానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం కాగా, రైల్వే బోర్డు సంబంధిత పనుల నిర్మాణానికి ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

- Advertisement -

కాగా, విశాఖపట్టణం-విజయవాడ, శంషాబాద్‌-విశాఖపట్టణం మధ్య రెండో లైన్‌ పూర్తయితే, ఈ మార్గంలో మరిన్ని రైళ్లు ప్రవేశపెట్టానికి వీలు కలుగుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, తెలంగాణలోని మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్‌ నిర్మాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పరిసర ప్రాంతంలో హాల్టింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు కానుంది. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం తిమ్మారెడ్డిపల్లి కమాన్‌ నుంచి కొమురవెల్లి దగ్గరలో హాల్టింగ్‌ రైల్వే స్టేషన్‌ ఏర్పాటు కానుంది.

ఇప్పటికే రైల్వే స్టేషన్‌ నిర్మాణానికి స్థల పరిశీలన సైతం పూర్తయింది. కొత్తపల్లి-మనోహరాబాద్‌ రైల్వే మార్గం పూర్తి కావడానికి మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉన్నందున జనవరిలోగా సిద్దిపేట వరకు పనులు పూర్తి చేసి కొన్ని రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా, రూ.720 కోట్ల వ్యయంతో చేపట్టిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. సొగసైన ఫీచర్లు, ఆధునిక రూపాలతో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను చేపట్టడానికి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఇందులో భాగంగా మొత్తం 9.5 లక్షల లీటర్ల నిల్వ సామర్ధ్యంతో 3 భూగర్భ ట్యాంకుల నిర్మాణం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉత్తరం వైపు మల్టిd లెవల్‌ కార్‌ పార్కింగ్‌ సౌకర్యం పనులు పురోగతిలో ఉండగా, ప్రయాణికుల రాకను సులభతరం చేయడానికి, పార్కింగ్‌ అవసరాలు తీర్చడానికి సికింద్రాబాద్‌ స్టేషన్‌ దక్షిణం వైపున రెండు కొత్త బేస్మెంట్లు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement