దేశవ్యాప్తంగా పోర్టర్లకు రేట్లను పెంచినందుకు భారతీయ రైల్వేలకు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ”నా కూలీ సోదరుల గోడును భారతీయ రైల్వేలు, ప్రభుత్వం వినడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. పలు జోన్లలో పోర్టర్ల రేట్లను సవరిస్తూ నార్త్రన్ రైల్వేలు ఒక ఉత్తర్వు జారీ చేసింది. సవరించిన రేట్ల ప్రకారం ప్రయాణికులు ఒక ట్రిప్పులో 40 కేజీల లగేజీని 20 నిముషాలు మోసినందుకు రూ.100కి బదులుగా రూ.140ను ఏ జాబితాలోని స్టేషన్లలో చెల్లించాల్సి ఉంటుంది. అదే బీ జాబితాలోని స్టేషన్లలో రూ.70కి బదులుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
దాదాపుగా ఏడు సంవత్సరాల తర్వాత పోర్టర్ల రేట్లను సవరించారు. గత నెల 21న ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ సందర్శించిన రాహుల్ గాంధీ పోర్టర్ల ఎర్ర చొక్కాను ధరించారు. వారితో ముచ్చటించారు. పోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఈ సందర్భంగా రేట్ల సవరణ, జీవిత బీమా, పింఛన్లు కోసం పోర్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.