Friday, November 22, 2024

రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి.. బీజేపీ నేతలు లక్ష్మణ్, బండి సంజయ్ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నరేంద్ర మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు-రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు-కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇతర బీజేపీ నేతలతో కలిసి శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… మోదీ ఇంటి పేరు సహా ఓబీసీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించిందని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వం, కులం గురించి ఇష్టమొచ్చినట్టు రాహుల్ మాట్లాడడం ఇది మొదటిసారి కాదని ఆరోపించారు.

బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే పరిగణిస్తూ నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మోదీ కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు చోటు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. తన వంటి ఓ సామాన్య కార్యకర్తకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డులో అవకాశం కల్పించారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు కోర్టు తీర్పును బీజేపీ తీర్పుగా చిత్రీకరిస్తూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీసీలను సంఘటితం చేస్తామని,
తెలంగాణలో బీజేపీని అజేయ శక్తిగా తీర్చిదిద్దుతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ… ఓబీసీల్లో ఉండే తేలి సామాజిక వర్గాన్ని కించపరిచేలా రాహుల్ గాంధీ ఓబీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. కోర్టు తీర్పుకు, బీజేపీకి సంబంధం ఏముందని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ, చట్టాలపై రాహుల్ గాంధీకి కనీస గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళన చేయడమంటే కోర్టు ఉల్లంఘన కిందికే వస్తుందని, రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని సంజయ్ అన్నారు. ఆయన చేసే వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తల పట్టుకుంటున్నారని, విదేశీ గడ్డ మీద భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన కోర్టు తీర్పును శిరసా వహించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ నోటీసులపై న్యాయపరంగా కొట్లాడతామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్ నిధుల ద్వారా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. అందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కాదా? ఈ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement