హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రైతాంగానికి ధైర్యం ఇవ్వడానికి మే 6న వరంగల్‌లో రాహుల్‌గాంధీతో సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. వరంగల్ సభకు ప్రజలు ఊహించనంతగా వస్తారని అభిప్రాయపడ్డారు. ఆదివారం టీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో పలువురు సీనియర్లు సమావేశమై.. వరంగల్ సభ విజయంతం చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి తదితరులు కలిసి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్‌లోని రాహుల్‌గాంధీ సభను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మే వాళ్లందరూ రావాలని, రైతులు, రైతు కూలీలు వచ్చి విజయంతం చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన సబ్సిడీలు టీఆర్ఎస్ ప్రభుత్వం బంద్ చేసిందని, రుణమాపీ భారం లక్ష పోయి.. నాలుగు లక్షలు అయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంపై ఏమి చేస్తామో వరంగల్ సభలో రాహుల్‌గాంధీ సందేశం ఇస్తారని ఆయన తెలిపారు. గుజరాత్లో ఎమ్మెల్యే జిగ్నేష్మేహనిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. బీజేపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..