హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ భారతో జోడో ‘ పాదయాత్రకు సంబంధించిన తెలంగాణ రూట్ మ్యాప్ ఫైనల్ అయింది. టీ పీసీసీ రూపొందించిన రూట్ మ్యాప్‌ను ఏఐసీసీ ఆమోదించింది. పాదయాత్ర రూట్ మ్యాప్ విషయంలో పార్టీకి చెందిన ఢిల్లి పెద్దలు, టీ పీసీసీ నాయకులు పలుమార్లు సమవేశాలు, సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు, సూచనల మేరకు ఇప్పటికే రెండు సార్లు పాదయాత్ర రూట్‌ను మార్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఫైనల్ చేసింది. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీభవన్‌లో భారత్ జోడో యాత్రపై జరిగిన సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మానిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు.
రాహుల్ పాదయాత్ర ఆక్టోబర్ 23న కర్ణాటక నుంచి కృష్ణానదీ బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మక్తల్ అసెంబ్లి నియోజక వర్గంలోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 6 వరకు రాష్ట్రంలో యాత్ర కొనసాగి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలో 375 కిలోమీటర్ల మేరకు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. మొదటిసారి తీసుకున్న నిర్ణయం ప్రకారం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించకుండానే ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి పఠాన్‌చెరువు, సంగారెడ్డి మీదుగా జోగిపేట్, మద్నూర్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించే విధంగా రూట్ మ్యాప్‌ను ఖరార్ చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి వెళ్లడం వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదని, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పడంతో.. నిర్ణయం మార్చుకుని నగరం నుంచి వెళ్లే విధంగా ఫైనల్ చేశారు.
రాహుల్ పాదయాత్ర చేసే రూట్..
రాహుల్‌గాంధీ పాదయాత్ర అక్టోబర్ 23న రాష్ట్రంలోకి కృష్ణానదీ బ్రిడ్జి మీదుగా మక్తల్‌కు వస్తుంది. అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్‌నగర్ పట్టణం, జడ్చర్ల, షాద్‌నగర్, శంషాబాద్, అరంఘార్, బహూదుర్‌పూరా, చార్మినార్, అప్జల్‌గంజ్, మోజాంజాయి మార్కెట్, గాంధీభవన్, నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాందీ విగ్రహం, బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్, బాలానగర్, ముసాపేట్ వై జంక్షన్, కూకట్‌పల్లి, మియాపూర్, బెల్, పఠాన్‌చెరువు, ముత్తంగి ( ఓఆర్‌ఆర్), సంగారెడ్డి చౌరస్తా, సంగారెడ్డి రిజర్వ్‌ఫారెస్టు, జోగిపేట్, శంకరంపేట్, మద్నూర్ మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది.
నగరంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి..
రాహుల్ పాదయాత్ర ప్రధానంగా గ్రేటర్ పరిధి నుంచి వెళ్లే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రేటర్‌లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ యాత్ర వల్ల లాభం జరుగుతుందనే భావనలో ఉన్నారు. బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టిన భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచే ప్రారంభించడం లేదంటే కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి సెంటిమెంట్‌న్ రగిలించే కార్యక్రమం చేస్తున్నారని చెబుతున్నారు. అందుకు రాహల్ పాదయాత్ర చార్మినార్, పాతబస్తీలో ఉండే విధంగా ప్లాన్ చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో రాజీవ్‌గాంధీ కూడా సద్భావన యాత్రను చార్మినార్ నుంచే చేపట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు గుర్తు చేశారు. ఇందిరగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 31న నెక్లెస్ రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిరంగ సభకు భారీ జన సమీకరణ చేయాలని, ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలనే నిర్ణయానికి వచ్చారు.