మణిపూర్ నుంచి ముంబై వరకూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ యాత్రకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఇంఫాల్ తూర్పు జిల్లా హట్టా కంగ్జిబుంగ్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా మణిపూర్ ప్రభుత్వం బుధవారం యాత్రకు అనుమతి నిరాకరించింది. జనవరి 14 నుంచి రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కే. మేఘచంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం ఎన్. బీరెన్ సింగ్‌తో బుధవారం ఉదయం సమావేశమయ్యారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ నేతలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్ధితి కారణంగా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు సీఎం తెలిపారు.
ప్రైవేటు స్థలానికి వేదిక మార్పు
మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని మేఘచంద్ర అభివర్ణించారు. అనుమతి నిరాకరించడంతో తౌబల్ జిల్లాలోని ఖోంగ్జాంలోని ఓ ప్రైవేట్ స్ధలానికి వేదికను మార్చామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇక 14 రాష్ట్రాలు, 85 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాహనాలతో పాటు పాదయాత్రగా భారత్ న్యాయ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.