రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని, పార్టీని అతనే నడిపించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని కాంగ్రెస్ చీఫ్ విప్ మాణికం ఠాగూర్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీడబ్ల్యూసీ ఇవ్వాల భేటీ అయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తీర్పు పంజాబ్లో అధికారాన్ని నిలబెట్టుకోలేక, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో అధికారాన్ని సమర్థవంతంగా సవాలు చేయలేకపోయిన కాంగ్రెస్ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
యూపీలో అనుకున్న స్థాయిలో బీజేపీకి పోటీ ఇవ్వలేకపోయింది. 2019 లోక్సభ ఓటమి తర్వాత రాహుల్ గాంధని ఆదర్శంగా తీసుకొని వర్కింగ్ కమిటీకి వచ్చి పార్టీ చీఫ్ పదవికి రాజీనామా సమర్పించారు. ఆయన మార్గాన్ని చూపే నాయకుడు. ఆయన మాకు నాయకత్వం వహించాలి అని మాణికం ఠాగూర్ అన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాను వెనక్కి తీసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎప్పటినుంచో కోరుకుంటున్నామని, భవిష్యత్తులో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని ఆశిస్తున్నాం అన్నారు. సంఘ్, బీజేపీ వంటి సంఘటిత పార్టీలకు వ్యతిరేకంగా పోరాడగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మాణికం ఠాగూర్ అన్నారు. మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి విమర్శలన్నీ కాంగ్రెస్ వైపు మాత్రమే మళ్లుతాయని చెప్పుకొచ్చారు.