న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీ వరంగల్ సభ, తెలంగాణ పర్యటనను పొలిటికల్ టూరిజంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన, 2004 – 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు రూ. 12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. లూటీ సొమ్ము ఇంకా అయిపోలేదని, అందుకే ఆ సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ఇతరులు రాసిచ్చిన ప్రసంగాలను చదువుతూ రాహుల్ గాంధీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం లేకపోగా ఆయన పర్యటన కేవలం రాజకీయ పర్యాటకంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ విదేశాలను, విదేశీయులను పొగుడుతూ భారతదేశాన్ని నిందిస్తూ అవమానిస్తున్నారని తరుణ్ చుగ్ అన్నారు. మోదీ సర్కారు సాధించిన ఘనతలను ప్రపంచ దేశాధినేతలు ప్రశంసిస్తూ ఉంటే, రాహుల్ గాంధీ మాత్రం ఏనాడూ మెచ్చుకోలేదని గుర్తుచేశారు.
ముస్లింలను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తోందన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలకు బదులిస్తూ.. ఆయన (అసదుద్దీన్) దేశంలో మరో జిన్నా కావాలని ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తూ దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలు, హిందువులు, సిక్కులు, జైనులు అన్న బేధం, వివక్ష లేకుండా మోదీ సర్కారు పనిచేస్తోందని తెలిపారు. ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్’ నినాదంతో పనిచేస్తున్న మోదీ సర్కారును అన్ని మతాల ప్రజలు మెచ్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సరూర్‌నగర్ పరువు హత్య ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు చేపట్టడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ బీ-టీమ్‌ను సంతోషపెట్టడం కోసమే కేసీఆర్ అలా చేస్తున్నారని సూత్రీకరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..