న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేడు లోక్ సభలో నిప్పులు చెరిగారు.. ప్రధానిని రావణుడితో పోలుస్తూ మణిపూర్ లో భరతమాతను హత్య చేశారంటూ విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రావణుడు ఇద్దరు మాటలు విని లంక దహనానికి కారణమయ్యాడంటూ , మోడీ కూడా కేవలం అమిత్ షా,అదానిలు మాటలు వింటూ హిందూస్థాన్ ను పతనం చేస్తున్నారంటూ ఆరోపించారు..
ముందుగా ఆయన లోక్ సభలో తన భారత్ జోడో యాత్రను వివరిస్తూ, భారత్ జోడో యాత్ర తన అహంకారాన్ని అణచివేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్దనేతకు ఇబ్బంది అనిపించిందేమోనని పరోక్షంగా ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అదానీ గురించి ఈ రోజు మాట్లాడను, మీరు భయపడాల్సిన పనిలేదన్నారు. తనది రాజకీయ ప్రసంగం కాదన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. భారత్ జోడో యాత్ర ఇంకా ముగియలేదన్నారు. లడ్డాఖ్ వరకు తాను యాత్ర చేస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ యాత్రలో ప్రజల సమస్యలను తాను దగ్గరుండి చూసినట్టు చెప్పారు. పాదయాత్రలో అనేక అంశాలను తాను నేర్చుకున్నట్టుగా చెప్పారు. ప్రజల కష్టాలను దగ్గరుండి చూసినట్టుగా ఆయన గుర్తు చేసుకున్నారు.లక్షల మంది తనతో కలిసి రావడంతో తనకు ధైర్యమొచ్చిందని ఆయన తెలిపారు. పాదయాత్ర చేసే సమయంలో తనలో కొద్ది కొద్దిగా అహంకారం మాయమైందని ఆయన వివరించారు. పాదయాత్రలో తాను అనేక విషయాలను నేర్చుకున్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు.
ఇక మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ, కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. ఇప్పటి వరకు ఆయన ఎందుకు వెళ్లలేదంటే, మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ అన్న పదాన్ని తాను వాడానని, కానీ వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేదన్నారు. మణిపూర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించినట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ మణిపూర్‌ను విభజించి, విడగొట్టినట్లు రాహుల్ అన్నారు. మణిపూర్‌ను చంపి భారత్‌ను హత్య చేశారని ఆరోపించారు. మీరే దేశద్రోహాలు అని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్నారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయినప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, భారత ప్రజల ఆవేదనను ప్రధాని మోడీ అర్థం చేసుకోరు అని, కానీ ఆయన ఇద్దరి వ్యక్తుల మాటలు వింటారని ఆరోపించారు. రావణుడు ఇద్దరి మాటలు మాత్రమే వినేవారని, అలాగే మోడీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని ఆరోపించారు. లంకను హనుమంతుడు కాల్చలేదని, రావణుడి అహంకారమే ఆ లంకను తగలపెట్టిందని, ప్రధాని మోడీ అహంకారం వల్ల దేశం తగలబడిపోతోందన్నారు. మూడు నెలలుగా మణిపూర్ మండుతుంటే సైన్నాన్ని ఎందుకు పంపలేదని మోడీని నిలదీశారు.. మణిపూర్ ఈ దేశంలో ఒక భాగం కాదని మీరు భావిస్తున్నారా అంటూ ప్రధానిని ప్రశ్నించారు.. మణిపూర్ లో జరిగిన మారణకాండ,హత్యలు, విధ్వంసం ప్రభుత్వ వైఫల్యాల వల్లేనంటూ విరుచుకుపడ్డారు.. చివరగా ఆయన మాట్లాడుతూ హిందూస్థాన్ ను మణిపూర్ లో హత్య చేసిన ఘనత మోడీదేనంటూ లోక్‌సభ ఎంపీగా తనను మళ్లీ నియమించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ థ్యాంక్స్ చెప్పారు..