న్యూ ఢిల్లీ – భారత్ లోని ప్రధాన రంగాలను తన గుప్పిట్లో ఉంచుకుని ప్రపంచ కుబేరుడిగా మారిన అదానితో మీకు బంధం ఏమిటని నిండు సభలో ప్రధాని మోడీని నిలదీశారు కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ..‘‘గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఈ అనుబంధం మొదలైంది. మోడీతో కలిసి ఓ వ్యక్తి తిరిగేవాడు. ఆయనకు నమ్మకంగా ఉండేవాడు. 2014లో ఢిల్లీకి మోడీ చేరుకున్నాక అసలు మ్యాజిక్ మొదలైంది’’ అంటూ విరుచుకుపడ్డారు రాహుల్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో పాల్గొని మాట్లాడుతూ, అదానీ అంశంపై పార్లమెంటులో చర్చ జరగకుండా చేసేందుకు మోదీ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
ఇక ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం అదాని గురించే చర్చ జరుగుతుందన్నారు. అదాని ప్రతి వ్యాపారంలో దూరిపోతారని, అందులో విజయం కూడా సాధిస్తారని అన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు.. ఇలా ప్రతిదీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశం మొత్తం ఆదానికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. జివికె ఆధ్వర్యంలో నడుస్తున్న ముంబై ఎయిర్ పోర్ట్ ను బలవంతంగా అదాని గ్రూప్ కి అప్పగించడం నిజం కాదా నేరుగా ప్రధానికే ప్రశ్నలు సంధించారు. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ పై మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
అదాని షెల్ కంపెనీలపై విచారణ జరిపే దమ్ము మోడీకి ఉందా? అని ప్రశ్నించారు. 2014లో 8 బిలియన్ డాలర్ల ఆదాని వ్యాపార సామ్రాజ్యం 2022లో 140 బిలియన్ డాలర్లకి మారిపోయిందన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో 2014లో 609 వ స్థానంలో ఉన్న అదాని.. 2022లో రెండవ స్థానానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. మోడీ, ఆదాని సంబంధం ఇప్పటిది కాదని. చాలా పాతదని అన్నారు. హిండెన్స్ బర్గ్ నివేదిక బహిర్గమైన తర్వాత భారత ముదుపురలలో కొత్త భయాలు మొదలయ్యాయని అన్నారు. ఈ సభలోనే తన భారత్ జోడో పాదయాత్రలో అనుభవాలను వివరించారు. దేశంలో ప్రధానంగా నిరుద్యోగం, పెరిగిన ధరలు, రైతుల సమస్యలు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అగ్ని వీర్ యోజన సైనికుల నుంచి వచ్చిన ఆలోచన, ప్రతిపాదన కాదని.. ఈ ఆలోచన, ప్రతిపాదన జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ దేనని అన్నారు. తుపాకీ పేల్చడంలో శిక్షణ పొందిన
వ్యక్తి వల్ల కొన్నిసందర్భాలలో సమాజంలో చెడు జరిగే అవకాశం ఉందంటూ అగ్నివీర్ పథకాన్ని విమర్శించారు.