న్యూఢిల్లి: భారత్ జోడో యాత్ర రాజాస్థాన్‌లో కొనసాగు తున్న సమయంలో రాహుల్ గాంధీ కర్లీటేల్స్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆహారపు అలవాట్లు, పెళ్లి ప్రస్తావనపై మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. పెళ్లి గురించి స్పందిస్తూ, పెళ్లికినేను వ్యతిరేకం కాదు. సరైన అమ్మాయి దొరికితే తప్పకుండా చేసుకుంటాను. సమస్య ఏమిటంటే, మా అమ్మానాన్నలది ప్రేమ వివాహం. వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందుచేత నా అంచనాలు కాస్తపైనే ఉంటాయి. సరైన అమ్మాయి వస్తే తప్పకుండా వివాహం చేసుకుంటాను. ప్రేమించే వ్యక్తి, తెలివైన అమ్మాయి అయితే చాలు అని రాహుల్ స్పష్టంచేశారు.
తొలిజీతం 3000 పౌండ్లు..
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఇంట్లోనే చదువుకోవాల్సి వచ్చింది. నానమ్మ మరణం తర్వాత బోర్డింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నాను. ఉన్నత విద్యకోసం హార్వర్డ్‌కు వెళ్లా..నాన్న హత్య తర్వాత అక్కడి నుంచి ఫ్లోరిడాకు పంపారు. చదువు పూర్తయ్యాక లండన్‌లో ఓ కన్సల్టెన్సీ కంపెనీలో 2500-3000 పౌండ్ల జీతానికి పని చేశాను. అదే నా మొట్టమొదటి జీతం అని వివరించారు.
తెలంగాణ వంటకాల్లో ఘాటు ఎక్కువ..
ఆహార అలవాట్ల గురించి స్పందిస్తూ.. సాధారణంగా ఇంట్లో ఉంటే కచ్చితంగా డైట్‌ను పాటిస్తాను. కానీ జోడో యాత్రలో అవన్నీ సాధ్యపడవు కదా.. అయినా నేను భోజనం గురించి పెద్దగా పట్టించుకోను. అందుబాటులో ఏది ఉంటే అది తినేస్తా. బఠానీ, పనసపండు అంటే ఇష్టం ఉండదు. ఈ యాత్రలో భాగంగా చాలా రాష్ట్రాల వంటకాలను రుచిచూశాను. సంప్రదాయాల్లాగే ఆహారం లోనూ మన దేశంలో వ్యత్యాసాలున్నాయి. తెలంగాణ వంటకాలు కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం ఎక్కువ. నాన్ వెజిటేరియన్ వంటకాలను కూడా ఆరగిస్తాను. చికెన్, మటన్, సీఫుడ్ అన్నీ తినేస్తా. చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, ఆమ్లెట్ వంటివి చాలా ఇష్టం. ఇక ప్రతి ఉదయం కప్పు కాఫీ నోట్లో పడితేగానీ ఏ పనీ కాదు అంటూ చెప్పుకొచ్చారు.