న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారైంది. పొంగులేటి వచ్చే నెల 2న భారీ బహిరంగ సభ ద్వారా ఖమ్మంలో చేరతానని ప్రకటించగా.. జూపల్లి మాత్రం ఏఐసీసీ పెద్దల వెసులుబాటును బట్టి 14 లేదా 16 తేదీన మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం రాహుల్ గాంధీ సహా ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమవడానికి ముందు తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ అయ్యారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరితో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం గం. 3.00 సమయంలో ఖమ్మం, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలు ఇతర నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. తమ చేరికకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం రాహుల్, మల్లికార్జున ఖర్గే పార్టీలో చేరుతున్న నేతలతో ఫొటో సెషన్ నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో మాణిక్‌రావ్ థాక్రే, రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌లతో కలిసి పొంగులేటి శ్రీనిసవాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తొలుత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో ఎంతో మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ తొమ్మిదేళ్లలో జరుగుతున్న దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ అప్రజాస్వామిక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా రాజకీయ శక్తులన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. అధికార పార్టీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ అనంతరం పొంగులేటి మాట్లాడుతూ తన వివిధ పార్టీల్లో చేరికపై ఆరు నెలలుగా ప్రచారం జరిగిందన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం కలలు గన్న తెలంగాణ బిడ్డలు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను కూడా కాదని కేసీఆర్‌కు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది మొదలు తొమ్మిదిన్నరేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో, ప్రజలు ఏం కోరుకున్నారో అది ప్రజలకు దక్కలేదన్నది ముమ్మాటికీ నిజమన్నారు.
తనను పార్టీ నుంచి బహిష్కరించారనో, పదవులు ఇవ్వలేదనో, జూపల్లిని అవమానించారనో, ఇబ్బందులు పెట్టారనో అనేది ప్రధానాంశం కాదన్నారు. జూపల్లితో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేశామన్నారు. అనేక మంది మేధావులు, నిపుణులు, ఉద్యమకారులు, వివిధ వర్గాలతో చర్చించామని, వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత, ప్రత్యేక సంస్థలతో సర్వే చేయించిన తర్వాత అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఒకపక్కన ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకపక్కన ఉందని తేలిందన్నారు. 80 శాతానికి మించిన ఓటు ఒక పక్కన ఉందని ఆయన వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు తమ పార్టీల్లోకి ఆహ్వానించినా ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకుని ఏ పార్టీలోకి వెళ్తే న్యాయం జరుగుతుందనేది ఆలోచించుకున్నామన్నారు.
కేసీఆర్‌ను గద్దె దింపడానికి అసంతృప్తితో ఉన్న అనేక మంది నాయకులతో ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా రెండు నెలల పాటు చర్చించామని, ప్రజాభిప్రాయం సేకరించామని చెప్పారు. ప్రాంతీయ పార్టీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందే తప్ప, కేసీఆర్‌ను ఇంటికి పంపాలనే లక్ష్యం నెరవేరదని, పైగా వారే మళ్లీ అధికారం చేపట్టే అవకాశముంటుందనే కోణంలో కూడా ఆలోచించి ప్రాంతీయ పార్టీ ఆలోచనను విరమించుకున్నామన్నారు. మళ్లీ మేధావులు, నిపుణులు, ఉద్యమకారులతో చర్చించి వారందరి అభిప్రాయం తీసుకుని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రణాళిక రూపొందించామన్నారు. అధికార పార్టీ అండ ఉంటేనే వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిసినా కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందన, తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో లుకలుకలను గమనించి అనేకవిధాలుగా ఆలోచించి కాంగ్రెస్‌లో చేరాలనుకున్నామన్నారు.
బీజేపీ నుంచి కూడా సంప్రదింపులు జరిగాయని, అధికారం కోసమో, డబ్బు కోసమో, పదవుల కోసమో చేరాలనుకుంటే ఏ పార్టీలో చేరవచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన ఆత్మగౌరవం కల్వకుంట్ల కుటుంబం కారణంగా దక్కడం లేదని పొంగులేటి అన్నారు. దళిత ముఖ్యమంత్రి సహా అనేక తప్పుడు హామీలిచ్చి మాయమాటలు, మాటల గారడీ చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తులని విమర్శించారు. తనకున్న సాహిత్య పరిజ్ఞానంతో ప్రజల్ని నమ్మించి మోసగించగలరని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ అధ్యయనం, విశ్లేషణ తర్వాత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలిసి పార్టీలో చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్టు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
నష్టపోతామని తెలిసీ…
తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పొంగులేటి అన్నారు. ఇందుకు తెలంగాణ బిడ్డలంతా ఆమెకు రుణపడి ఉండాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఇచ్చినప్పటికీ కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పలేకపోయిందని, అందుకే అధికారం పొందలేకపోయిందని తెలిపారు. ఒకవేళ మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మాయమాటలతోనే పబ్బం గడుపుతారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రం కావాలంటే కేసీఆర్‌కు ఎదురుగా నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని తమ ఆరు నెలల సుదీర్ఘ ప్రయాణం ద్వారా అర్థమైందని చెప్పారు. జులైన 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తాను కాంగ్రెస్‌లో చేరతానని వెల్లడించారు. తనతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు ఆ రోజు పార్టీలో చేరతారని.. కనీవినీ ఎరుగని రీతిలో మహా సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించిన సభను తలదన్నేలా తాను ఏర్పాటు చేసే సభ ఉంటుందని పొంగులేటి నొక్కి చెప్పారు. తన సభకు ఎంతమంది వస్తారో లెక్కించుకోడానికి సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తనకు పదవి, డబ్బు, వ్యాపారం కావాలనుకుంటే కాంగ్రెస్ లో చేరనని, ఆ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడా అధికారంలో లేదని అన్నారు. అధికారంలో లేని పార్టీలో చేరితే ఇబ్బందులు ఉంటాయని తెలుసని, ఇప్పటికే ఆ ఇబ్బందులు మొదలయ్యాయని కూడా వెల్లడించారు. అయినా సరే ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల రుణం తీర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో.. తెలంగాణలోనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యం పాతాళానికి.. అవినీతి ఆకాశానికి: జూపల్లి కృష్ణారావు
ఆరు దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే గొప్ప ఉద్యమాల్లో ఒకటని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 1969లో జరిగిన ఉద్యమంలో 365 మంది బుల్లెట్లకు బలవగా, మలిదశ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేసారు. ఉద్యమం ఎంత గొప్పగా జరిగిందో, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ పాలన కూడా అంత గొప్పగా ఉంటుందని ప్రజలందరూ అనుకున్నారని, కానీ పూర్తి భిన్నంగా పాలన సాగుతోందని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశానికి చేరిందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల్ని మభ్యపెట్టే స్కీములు పెట్టి, వాటిని అమలు చేయకుండా మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికి మరో కొత్త స్కీము ప్రకటించుకుంటూ మాటల గారడీ చేయడంలో కేసీఆర్ ఆరితేరారనని, కానీ ప్రజలు ఈసారి ఆయన మాటలు విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ ఆదర్శం అని మాట్లాడిన వ్యక్తి రాజ్యాంగాన్నే తిరగరాయాలంటూ ఆ మహనీయుణ్ణి అవమానించారని జూపల్లి అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు.. ప్రజల ఖజానా నుంచి ప్రకటనల రూపంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
ఇవన్నీ చూసిన తర్వాత జనం చాలా పొరపాటు చేశామన్న భావనలోకి వెళ్లారని చెప్పుకొచ్చారు. రకరకాల స్కీములు.. వాటి వెనుక స్కాముల చరిత్ర కల్గిన కేసీఆర్‌కు మూడోసారి పరిపాలించే నైతిక హక్కు, అర్హత లేదని అన్నారు. 2009లో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందని తెలిసి, రిస్కు తీసుకుని తెలంగాణ ప్రజల కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని అన్నారు. అయినా సరే ఉద్యమ పార్టీ అన్న ఉద్దేశంతో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించారని, ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించకపోతే ఆ దేవుడు కూడా క్షమించడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏఐసీసీ నాయకత్వం వెసులుబాటును బట్టి జులై 14 లేదా 16 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరతామని అన్నారు.
ప్రియాంకతో భేటీ
మీడియా సమావేశంలో నేతలిద్దరూ మాట్లాడుతుండగానే ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి అక్కడికి చేరుకుని సందేశాన్ని పంపించారు. అక్కణ్ణుంచి పొంగులేటి, జూపల్లి హుటాహుటిన బయల్దేరి ఏఐసీసీ కార్యాలయం పక్కనే ఉన్న 10-జన్‌పథ్ (సోనియా గాంధీ నివాసం)కు చేరుకుని ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా ప్రియాంక గాంధీని కలిశామని, ఖమ్మం – మహబూబ్‌నగర్‌లో తలపెట్టిన సభలకు ప్రియాంకను రావాల్సిందిగా ఆహ్వానించామని జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ భేటీ అనంతరం నేతలిద్దరూ హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.