సైబరాబాద్ కమిషనర్, గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్లపై క్రమశిక్ష చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. సీబీసీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ అంతర్రాష్ట్ర న్యాయ నిబంధనలు ఉల్లంఘించారని, తన అరెస్ట్ సమయంలో నిబంధనల ప్రకారం గచ్చిబౌలి పోలీసుల నుంచి సీబీసీఐడీ అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని, ఆ విషయాన్ని తాను చెబితే ఫోన్‌లో మాట్లాడి ఏదో తూతూమంత్రంగా సమాచారం అందించారని పేర్కొన్నారు
తన నివాసానికి వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీసులు గుర్తించలేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తన అరెస్ట్ విషయంలో ఏపీ సీబీసీఐడీతో గచ్చిబౌలి పోలీసులు కూడా కలిసిపోయారని ఆరోపించిన రఘురామరాజు ఈ విషయంపై విచారణ జరిపించాలని సీఎంను కోరారు. అలాగే, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కూడా రఘురామ రాజు లేఖలు రాశారు. ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారని ఆ లేఖలో ఎంపీ పేర్కొన్నారు.