హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. సీనియర్ విద్యార్థుల వేధింపులు శృతి మించుతుండడంతో ఎంబీబీఎస్ చదువును ఎలా కొనసాగించాలో తెలియక జూనియర్ విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ర్యాగింగ్‌ను భరించలేక జూనియర్ విద్యార్థులు, ర్యాగింగ్ చేసినందుకు సీనియర్ విద్యార్థులు వైద్య విద్యకు దూరమవ్వాల్సిన పరిస్థితులు మెడికల్ కాలేజీల్లో తరచూ నెలకొంటున్నాయి.
ఇటీవల తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కళాశాల యాజమాన్యలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కానరావడం లేదు. దాదాపు 25 రోజుల వ్యవథిలోనే హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో తాజాగా ఇప్పుడు మహబూబాబాద్ వైద్య కళాశాలలో ఇలా మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇవి కేవలం ఫిర్యాదు దాకా వచ్చిన ర్యాగింగ్ ఘటనలు మాత్రమేనని, ఫిర్యాదు చేయకుండా సీనియర్ల ర్యాగింగ్ వేధింపులను జూనియర్ విద్యార్థులు భరిస్తూ వస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్ కావాలన్న జీవితాశయంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు పొంది మెడికల్ కాలేజీలోకి అడుగుపెట్టిన జూనియర్ వైద్య విద్యార్థుల ఆశలను ర్యాగింగ్ భూతం చిదిమేస్తోంది. అయితే ఫిర్యాదు దాకా రాని రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మరికొన్ని కాలేజీల్లో కూడా ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.
అయితే అవి ఫిర్యాదు వరకు రావడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితం గాంధీ మెడికల్ కాలేజీలో సీనియర్ విద్యార్ధులు హాస్టల్‌లో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై వారు జాతీయ వైద్య కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. ఎన్‌ఎంసీ ఆదేశాలతో స్పందించిన సర్కారు వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. ర్యాగింగ్‌కు పదిమంది సీనియర్ విద్యార్థులను బాధ్యులుగా గుర్తించి ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
ఆ ఘటన మరవకముందే వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మరో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కాలేజీ హాస్టల్‌లో ఓ జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్ధులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఏడుగురు విద్యార్థులపై వేటు పడింది. జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన మహబూబాబాద్ వైద్య కళాశాలలోని ఏడుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఈ నెల 21న ఏడుగురు ఎంబీబీఎస్ రెండో సంవత్సంర విద్యార్థులు గదిలోకి తీసుకెళ్లి సార్ అని పిలవాలంటూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ జరిపించి, కమిటీ నివేదిక ఆధారంగా తల్లిదండ్రుల సమక్షంలో మందలించారు. మొదటి తప్పుగా భావించి ఆ ఏడుగురు విద్యార్థుల హాస్టల్ వసతిని రద్దు చేశారు.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో చోటుచేసుకున్న వరుస ర్యాగింగ్ ఘటనలపై చర్యలు తీసుకుంటున్నా మళ్లి మళ్లి పునరావృతం అవుతుండడంతో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని వైద్య విద్య ఉన్నతాధికారులను మంత్రి హరీష్‌రావు ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ర్యాగింగ్ ఘటనలపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది.