Friday, November 22, 2024

ప్రివిలేజ్ కమిటీ ముందుకు రఘురామ అనర్హత వ్యవహారం.. విచారణ చేప‌ట్టాల‌ని లోక్ సభ స్పీకర్ ఆదేశం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అనర్హత వ్యవహారం లోక్‌సభ ప్రివిలేజి కమిటీ ముందుకు చేరింది. వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ దాఖలు చేసిన పిటిషన్‌లో రఘురామకృష్ణ రాజుపై లేవనెత్తిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఎదుట పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌తో పాటు, లోక్ సభ రూల్స్, 1985లోని రూల్ నెంబర్ 6 ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వీలైనంత వేగంగా చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి నేతృత్వంలోని ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు సంబంధించి వీడియో ఫుటేజి సహా ఇతర ఆధారాలను సైతం ఎప్పటికప్పుడు స్పీకర్ సచివాలయానికి అందజేస్తున్నారు. తాజాగా పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రతిపక్ష పార్టీలు భాగమైన ఓ బహిరంగ సభకు హాజరైన అంశాన్ని సైతం స్పీకర్ సెక్రటరియట్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.

మొత్తానికి పిటిషన్ దాఖలు చేసిన రెండేళ్ల తర్వాత స్పీకర్ ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీని అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. లోక్ సభ రూల్స్, 1985లోని రూల్ 7(4) ప్రకారం ప్రివిలేజ్ కమిటీ ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా స్పీకర్ సచివాలయం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. లోక్‌సభ సచివాలయం విడుదల చేసిన ఈ బులెటిన్లో రఘురామకృష్ణ రాజు వ్యవహారంతో పాటు బెంగాల్ ఎంపీ శిశిర్ కుమార్ అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సుదీప్ బందోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ గురించి కూడా ప్రస్తావన ఉంది. ఈ రెండు అంశాలపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా లోక్‌సభ సచివాలయంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక విభాగం ప్రివిలేజ్ కమిటీని కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement