బీజేపీ గెలుపు ఖాయం
రాహుల్ పలాయనమే సాక్ష్యం
రిజర్వేషన్లు మార్చేది లేదు..
లోక్ సభలో 400 మంది బలం
ఉన్నా మేం ఆ ప్రయత్నం చేయలేదు
కోల్ కతా – లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది స్పష్టమైందని, దీనికి ఓపీనియన్ పోల్స్ అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తారనే ప్రకటన వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ… రాహుల్ వయనాడ్‌తో పాటు మరో స్ధానం నుంచి పోటీ చేస్తారని తాను గతంలో చెప్పానని గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్-దుర్గాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ… రాహుల్ వయనాడ్‌లో ఓటమి పాలవుతారని తాను చెప్పానని, అందుకే రెండో స్ధానం కోసం వెతుకులాట చేపట్టి రాయ్‌బరేలి నుంచి బరిలో నిలిచారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకుంటోందని, దళితులు, ఓబీసీ కోటాలను కత్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాలని కుయుక్తులు పన్నుతోందని మోదీ దుయ్యబట్టారు. విపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకోవని, ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే వాటికి తెలిసిన మార్గమని ఆరోపించారు. కాంగ్రెస్‌కు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని రాతపూర్వకంగా ఇవ్వాలని సవాల్ విసిరారు. దేశానికి హామీ ఇవ్వండి.. రాతపూర్వకంగా హామీ ఇవ్వండి. ఎందుకంటే వారిని మనం నమ్మలేం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రకటించాలని సవాల్ విసిరారు. ఎస్సీ,ఎస్టీ, ఓబిసి, జనరల్ కేటగిరీ రిజర్వేషన్‌లను ఎప్పటికీ తాకబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు మోదీ.
కాంగ్రెస్, ఇండియా కూటమి అబద్ధాలతో మరోసారి రంగంలోకి దిగాయనీ, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనీ, రిజర్వేషన్లు తీసేస్తామని అబద్ద ప్రచారం చేస్తుందని ప్రధాని మండిపడ్డారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలించిన పార్టీ ప్రజలకు చేరువ కావడానికి అసత్య ప్రచారం చేస్తుందనీ, అబద్దాల ప్రేమ దుకాణం ఫేక్ ఫ్యాక్టరీ ప్రారంభించిందన్నారు. 400 సీట్ల గురించి మాట్లాడుతున్నవారు తమకు పార్లమెంట్‌లో ఇప్పటికే 360 స్ధానాలు ఉన్నాయన్న విషయం మరువరాదనీ గుర్తు చేశారు. బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు తమ కూటమిలో లేకున్నా తమకు మద్దతు ఇస్తాయని అన్నారు. వీటన్నింటిని కలుపుకుంటే.. తమకు పార్లమెంట్‌లో 400 స్ధానాల బలమున్నా తాము రిజర్వేషన్లను తొలగించే పాపానికి పాల్పడలేదని గుర్తుచేశారు.