బెంగళూరు – రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కర్నాటకలోని చిక్కోడిలో శుక్రవారం ఎన్నికల ప్రచార ర్యాలీకి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పందించారు. రాహుల్ బాబాను సోనియా గాంధీ 2-20 సార్లు లాంఛ్ చేసినా ఇంతవరకూ విజయవంతం కాలేదని ఎద్దేవా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథి నుంచి పారిపోయి రాయ్‌బరేలిలో నామినేషన్ దాఖలు చేశారని అన్నారు.
రాహుల్ బాబా ఓటమి తప్పదు..
రాహుల్ గాంధీకి ఈ వేదిక నుంచి తాను ఓ విషయం చెప్పదలుచుకున్నానని, ఈ ఎన్నికల్లో రాహుల్ బాబా రాయ్‌బరేలి నుంచి బీజేపీ అభ్యర్ధి చేతి దినేష్ ప్రతాప్ సింగ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. ఇక అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాయ్‌బరేలి బరిలో రాహుల్ దిగడంపై స్పందించారు. కేరళలోని వయనాడ్‌లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ రాయ్‌బరేలి నుంచి కూడా పోటీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రాజ్యంగాన్ని మార్చాలని కోరుకుంటోందని, దళితులు, ఓబీసీ కోటాలను కత్తిరించి వాటిని జిహాది ఓటు బ్యాంక్‌కు పంచాలని కుయుక్తులు పన్నుతోందని మోదీ దుయ్యబట్టారు. విపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయాలని కోరుకోవని, ఓట్ల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడమే వాటికి తెలిసిన మార్గమని ఆరోపించారు.