హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ సమీపంలోని 25 ఎకరాల్లో రాధాకృష్ణ మందిరం నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది. మొత్తం రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మందిరానికి భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఇస్కాన్ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఇస్కాన్ ప్రతినిధులు అరణ్యభవన్‌లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
హైదరాబాద్‌కు సమీపంలోని సంగారెడ్డి జిల్లాలో సాధారణ ధరకు లీజు పద్దతిలో అనువైన స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. రాధాకృష్ణ మందిర ప్రాంగణంలో గోశాల, గురుకులం, వృద్ధాశ్రమం నిర్మిస్తామని మంత్రికి ఇస్కాన్ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.