చెన్నైలో శనివారం జరిగిన జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన యువ రేసర్ , 13 ఏళ్ల కొప్పరం శ్రేయస్ హరీష్ సర్క్యూట్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. బెంగళూరుకు చెందిన శ్రేయస్‌కు బైక్ రేసింగ్‌లు అంటే విపరీతమైన ఇష్టం. దీంతో రేసింగ్‌లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పలు రేసింగ్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో పెట్రోనాస్ టీవీఎస్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రేసుల్లో గెలిచి రైజింగ్ స్టార్‌గా ఎదిగాడు. మద్రాస్ అంతర్జాతీయ సర్య్కూట్‌లో ‘ జాతీయ మోటార్ సైకిల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్’ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగా శనివారం ఉదయం పోల్ పొజిషన్‌కు అర్హత సాధించిన హరీశ్ రూకీ రేసులో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మూడో రౌండ్‌లో అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. నిర్వాహకులు వెంటనే రేస్‌ను ఆపేసి శ్రేయస్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో పలువురు శ్రేయస్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ” ప్రతిభావంతుడైన ఒక యువ రైడర్‌ను కోల్పోయాం. గత కొంత కాలంగా అత్యద్భుత రేసింగ్ ప్రతిభతో శ్రేయస్ రాణిస్తున్నాడు” అని ఎంఎంఎస్సీ ప్రెసిడెంట్ అజిత్ థామస్ ఒక ప్రకటనలో తెలిపారు.