Saturday, November 2, 2024

Delhi: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలే.. ఉపరాష్ట్రపతిని కోరిన ఆర్.కృష్ణయ్య, బీసీ నేతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, రాజ్యాంగబద్ధ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆయన నాయకత్వంలో బీసీ సంఘాల నాయకులు శుక్రవారం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌ను కలిసి చర్చలు జరిపారు. బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, దక్షిణ భారత సంఘం అధ్యక్షులు జబ్బాల శ్రీనివాస్, జాతీయ ఓబీసీ సంఘం అధ్యక్షులు ఏ. వరప్రసాద్ తదితరులు చర్చలో పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, మైనార్టీలు ఇలా కేంద్రంలో 74 ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉండగా, బీసీలకు మాత్రం లేవని కృష్ణయ్య వాపోయారు. 56 శాతం జనాభా గల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం వల్ల బీసీ కులాల అభివృద్ధి కుంటుపడుతోందని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. మండల కమిషన్ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినా, అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు రూపుదాల్చకపోవడం శోచనీయమన్నారు.

ప్రత్యేక స్కీములు ఏర్పాటు చేసి బీసీలను విద్యారంగంలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రోత్సహించడంలో ఉపరాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని వారు కోరారు. బీసీ కులాలకు ప్రత్నామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్కో కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. అలాగే బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెటులో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ఓబీసీ విద్యార్థులకు వర్తింపజేయాలని, దేశంలోని ప్రతి యూనివర్సిటీలో పరిశోధనాత్మక విద్యార్థులకు 50 మంది రాజీవ్ ఫెలోషిప్ పథకాన్ని అమలు చేయాలని, చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారు జగదీప్ ధన్కడ్‌కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement