Saturday, November 23, 2024

Delhi | ఆర్-5 జోన్ భూముల కేసు విచారణ నవంబర్‌కు వాయిదా.. ప్రతివాదులకు నోటీసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అమరావతిలో ఆర్-5 జోన్ భూముల్లో గృహనిర్మాణాన్ని నిలుపుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించలేదు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు.

ధనికుల ఇళ్లస్థలాల పక్కన పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే ఓర్వలేకపోతున్నారని, అందుకే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. భూములకు పట్టాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపి, ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. కేసులో అనేకాంశాలు ముడిపడి ఉన్నాయని, ‘స్టే’ ఇవ్వాల్సినంత తొందర ఏమీ లేదని అభిప్రాయపడింది.

భూమి అసలు యజమానులకు పరిహారం అందకపోవడం, గృహ నిర్మాణ ప్రాజెక్టు రూ. 1,000 కోట్ల పై విలువైనది కావడం సహా చాలా అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో ప్రతివాదులుగా ఉన్న అమరావతి రైతులకు నోటీసులు జారీ చేసి, 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ పై మూడు వారాల్లోగా పిటిషనర్లు రిజాయిండర్లు దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణను నవంబర్‌లో చేపడతామని వెల్లడించింది. అమరావతి రైతుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఉన్నం మురళీధర్ రావు, శ్యామ్ దివాన్, శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement