Sunday, September 8, 2024

AP | టీటీడీ పదవులకు క్యూ.. ఇతర రాష్ట్రాల నుంచి ఆశావహుల లాబీయింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవులకు జాతీయ స్థాయిలో నేతలు క్యూ కడుతున్నారు. బోర్డులో 24 మంది డైరెక్టర్లతో పాటు తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) చైర్మన్‌లు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నామినేట్‌ చేయాల్సి ఉంది. చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డిని నియమించిన ప్రభుత్వం డైరెక్టర్ల పదవుల భర్తీలో స్పీడ్‌ పెంచింది. అయితే ఈ సారి కేంద్రం నుంచి సిఫార్సులు.. స్వామీజీల ఒత్తిళ్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన తరువాతే తుది జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు.

ఢిల్లి, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో పాటు మరికొందర్ని డైరెక్టర్లుగా నియమించాలని కేంద్రం మౌఖికాదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు విశాఖ శారదా పీఠం స్వామీజీతో పాటు మరికొందరు ఆధ్యాత్మిక ప్రముఖులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. అయితే పదవీ పంపకాల్లో సామాజిక సమతుల్యతతో పాటు సమర్ధులైన వారికి ఈ సారి టీటీడీ బోర్డులో స్థానం కల్పించాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్లు సమాచారం. పదవుల భర్తీపై త్వరలో అధికార పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి వచ్చేవారం తుది జాబితాను ప్రకటించేందుకు కసరత్తు జరుపుతున్నారు.

నామినేటెడ్‌ పదవులతో పాటు టీటీడీ పాలక మండలి నియామకాలతో పార్టీలో కొత్త ఊపు నింపేందుకు సీఎం జగన్‌ వ్యూహరచన చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే తిప్పే స్వామి పేర్లు ప్రముఖంగా వినవస్తున్నాయి. మధ్య కోస్తా ప్రాంతంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీటీడీ బోర్డు సభ్యునిగా గత పారకవర్గంలో వ్యవహరించారు. అయితే ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం టీటీడీ సభ్యునిగా ఉన్న పొన్నాడ సతీశ్‌ను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇవికాక మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి టీటీడీ పదవులకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. టీటీడీ జేఈఓగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత దళారుల వ్యవస్థను కొంత వరకు నిర్మూలించ గలిగారు. అయితే కొండపై సదుపాయాలు, ఇతర వ్యవహారాలపై భక్తులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల కాలినడక ప్రాంతంలో భక్తులపై పులుల దాడి, కొండపై గంజాయి లభ్యమవుతున్న సంఘటనలు భక్తుల్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నూతన పాలకమండలి నియామకంలో కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టీటీడీ పదవుల భర్తీలో కుల, ప్రాంతీయ సమీకరణలపై కూడా సీఎం జగన్‌ దృష్టి సారించారు.

- Advertisement -

రంపచోడవరం ఎస్టీ కేటగిరీ కింద దాట్ల రమణమ్మ పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి. ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు, కేంద్రం సిఫార్సులు, ఇతర రాష్ట్రాల ప్రతిపాదనల నేపథ్యం లో పంపకాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జాబితా సిద్ధమవుతున్న నేపథ్యంలో తాజాగా వస్తున్న ప్రతిపాదనలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌ భావిస్తున్నారు.

ఇకపై వివాద రహిత నిర్ణయాలు తీసుకునే విధంగా పాలకమండలి వ్యవహరించాలనేది సీఎం అభిమతం. కాగా ఈ సారి గతంలో టీటీడీ బోర్డులో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ వ్యవహారం కోర్టు విచారణలో ఉన్నందున ప్రస్తుతానికి ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి బ్రేక్‌ పడినట్లే అని చెబుతున్నారు. సోమ లేదా మంగళ వారాల్లో ఆశావహుల దరఖాస్తులను జల్లెడపట్టి తుది జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement