Friday, November 22, 2024

బీజేపీని ప్రశ్నించే ముందు కేసీఆర్‌ను ప్రశ్నించు.. కేటీఆర్ పై మండిపడ్డ ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు హద్దుమీరి మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఓ రెండు పత్రికల్లో (ఆంధ్రప్రభ కాదు) వక్రీకరించే కథనాలతో ప్రధాని మోదీని నిందిస్తూ విషప్రచారం సాగించారని జీవీఎల్ ఆరోపించారు. తప్పుడు ప్రచారంపై ఆ పత్రికల వివరణ కోరగా, ఎడిటర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. అందుకే ఆ రెండు పత్రికలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు అందజేశామని జీవీఎల్ తెలిపారు. తద్వారా బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తే రాజ్యాంగం పరిధిలో చట్టబద్ధంగా చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ఆయన తండ్రి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. యూపీఏ హయాం కంటే తమ హయాంలో 8 రెట్లు అధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి అందుతున్నాయని వివరించారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ “నిధుల గురించి బీజేపీని ప్రశ్నించే ముందు మీ నాన్నను ప్రశ్నించు. నాడు కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పమను” అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు మాత్రం నిందిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లకు ‘జగనన్న గృహాలు’ అంటూ తమ పేర్లు పెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో ఇచ్చే బియ్యం, ఇతర సరుకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం 5వ వంతు మాత్రమేనని, కానీ పూర్తిగా తామే ఇస్తున్నట్టుగా వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కోవిడ్-19 సమయంలో కేంద్రం పూర్తి ఉచితంగా ఆహార దినుసులు, రేషన్ సరుకులను అందజేసిందని గుర్తుచేస్తూ.. ఆ సమయంలో రాష్ట్రం ఉచితంగా ఏమిచ్చిందో చెప్పాలని నిలదీశారు. కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటూ ఇకపై తాము చూస్తూ ఊరుకోబోమని, కేంద్ర పథకాల గురించి ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెయింటింగ్స్ వేస్తామని తెలిపారు.

రాష్ట్రానికి కేంద్ర మంత్రులు

- Advertisement -

త్వరలో ముగ్గురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తారని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ విజయనగరం జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. అలాగే కడపలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విశాఖలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పర్యటనలు కూడా ఖరారయ్యాయని, తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని వివరించారు. కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడతామని అన్నారు. అలాగే ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తామని తెలిపారు. సమస్యలపై పార్లమెంట్‌లో తానే ప్రస్తావిస్తున్నాని గుర్తుచేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి రాష్ట్ర ప్రాజెక్టులకు ఇచ్చే నిధులు దారిమళ్లకుండా చూడాలని కోరాతానన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే నీటిపారుదల ప్రాజెక్టులకు మాత్రమే రుణ సదుపాయం కల్పించాలని కోరనున్నట్టు చెప్పారు.

కుటుంబ పార్టీలే మా టార్గెట్

ప్రజాస్వామ్యనికి కుటుంబ పార్టీల నుంచి ముప్పు పొంచి ఉందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. కుటుంబ పార్టీల పాలన దూరం చేయడమే లక్ష్యంగా 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోదీ ఖరారు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిశోర్ చేరికపై స్పందిస్తూ బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తల అవసరం లేదని, బయటివారిని తెచ్చుకుని వ్యూహాలు రచించాల్సిన పరిస్థితి బీజేపీలో లేదని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement