తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై రోజురోజుకూ ఆరోపణలు తీవ్రం అవుతున్నాయి. ఓ జ్యోతిష్యుడిని బెదిరించి డబ్బలు డిమాండ్ చేసిన కేసులో క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై క్యూ న్యూస్ మాజీ ఉద్యోగి చిలుక ప్రవీణ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టు కాదని, ఓ బ్లాక్ మెయిలర్ అని అన్నారు. మల్లన్న కేవలం డబ్బు సంపాదన కోసమే బహుజనవాదాన్ని, జర్నలిజాన్ని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న చేస్తున్న దందాలు తాము ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు.
లక్ష్మీకాంత్ అనే జ్యోతిష్యుడిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అమ్మాయిలను సైతం బ్లాక్‌మెయిల్‌చేసి వారి జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర ఆయనదని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మల్లన్నపై లైంగిక వేధింపుల కేసులు సైతం ఉన్నాయని తెలిపారు. తీన్మార్ మల్లన్న డబ్బులను అక్రమంగా సంపాదించారని చిలుక ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేశారు. డబ్బులు, ఆయన ఆస్తులు బినామీల పేరిట పెడుతుంటారని, ఆయన బినామీల్లో నాగరాజు గౌడ్, దాసరి భూమయ్య, రజనీ కుమార్, రంగయ్య, చింతపండు వెంకటేశ్వర్లు, ఉపేందర్ ఉన్నారని ప్రవీణ్ వివరించారు.
కాగా, జ్యోతిష్యుడిపై బెదిరింపు కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు శుక్రవారం(ఆగస్ట్ 27) రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరచగా.. సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.