భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారానికి అంబాసిడర్గా సింధు ఎంపికైంది. సింధుతో పాటు కెనడా షట్లర్ మిషెల్లీ లీకి కూడా ఈ గౌరవం దక్కింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించింది. ఈ ఇద్దరు షట్లర్లు గతేడాది ఏప్రిల్ నుంచి బీడబ్ల్యూఎఫ్ ‘ఐయామ్ బ్యాడ్మింటన్’ అనే ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా కొనసాగుతున్నారు.
కాగా ఐవోసీ తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై పీవీ సింధు స్పందించింది. ‘నన్ను రాయబారిగా ఐఓసీ ఎంపిక చేయడం నాకు దక్కిన గౌరవం. పోటీల్లో అవకతవకలపై పోరాటంలో నా సహచర అథ్లెట్లతో కలిసి నిలబడతా. కలిసికట్టుగా మనం బలంగా ఉండగలం’ అని సింధు తెలిపింది. రాయబారులుగా ఎంపికైన సింధు, లీ.. వెబినార్లు, సామాజిక మాధ్యమాల ద్వారా బ్యాడ్మింటన్ ప్లేయర్లకు అవగాహన కల్పించనున్నారు. క్రీడల్లో అత్యుత్తమంగా ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశంపై తమ సూచనలు, సలహాలు ఇస్తారు.