పెద్దపల్లి, : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే నిందితులు దంపతులను హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు లోకి వచ్చాయి. గురువారం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అంశాలు బహిర్గతమయ్యాయి. హత్య జరిగిన ప్రాంతంలో ప్రయాణి కులు తీసిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు దంపతులపై కుంట శ్రీనివాస్‌తో పాటు చిరంజీవి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.
నార్త్ జోన్ ఐజీపీ నాగిరెడ్డి బుధవారం అర్ధరాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణ ఆధ్వర్యం లో ఆరు పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా హత్య చేసిన నిందితులు కుంట శ్రీనివాస్‌తోపాటు సేవంతుల చిరంజీవిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
హత్య కుట్రలో జడ్పీ చైర్మన్ మేనల్లుడు
పోలీసు విచారణలో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మేనల్లుడు బిట్టు శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన వాహనం బిట్టు శ్రీనివాస్‌దిగా, హత్యకు ఉపయోగించిన కత్తులను సైతం ఆయనే సమకూర్చి నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఫిర్యాదులో పేర్కొన్న ముగ్గురితోపాటు చిరంజీవిని నిందితుడిగా చేర్చారు. పుట్ట మధు మేనల్లుడి ప్రమేయం ఉందని తెలియడంతో హైకోర్టు న్యాయవాదుల హత్యోదంతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితుడు శ్రీనివాస్ గుంజపడుగు గ్రామంలో నిర్మిస్తున్న ఇంటికి అనుమతి లేదని గట్టు వామన్‌రావు ఫిర్యాదు చేయడంతోపాటు సర్పంచ్‌తో నిర్మాణ పనులను నిలిపివేయించడం, రామాలయ కమిటీ విషయంలో తగాదాలు, ఎల్లమ్మ దేవాలయ నిర్మాణంలో అడ్డుపడడంతో కుంట శ్రీనివాస్ వామన్‌రావును హతమార్చేలా ఉసిగొల్పాయి. బుధవారం మంథని కోర్టుకు వచ్చి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లే క్రమంలో కల్వచర్ల వద్ద కాపుకాసి హత్య చేశారు.
జంట హత్యలు ఎన్నో అనుమానాలు….
కుంట శ్రీనివాస్‌కు మంథని మండలం విలోచవరంకు చెందిన చిరంజీవి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. బుధవారం హత్యకు ముందు చిరంజీవిని వాహనంలో తీసుకెళ్తుండగా వామన్‌రావుతో నానా ఇబ్బందులు పడుతున్నా నని, తాను చావడమైనా జరగాలి.. లేకపోతే వామన్‌రావును చంపితే తప్ప సమస్య పరిష్కారం కాదని వాపోవడంతో చిరంజీవి సైతం ఆయనతో హత్యలో పాల్గొనేందుకు జత కలిసినట్లు తెలు స్తోంది. వామన్‌రావు పుట్ట మధుకర్‌పై పలు కేసులు వేయడంతో కోపం పెంచుకున్న బిట్టు శ్రీనివాస్ హత్యకు సహకరించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దంపతుల హత్య కేసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించి మార్చి 1కి వాయిదా వేయడం తోపాటు పోలీసులు విచారణ వేగవం తంగా పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు సేకరిం చాలని ఆదేశించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.