రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రపంచ దేశాలు కోడై కూస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం, మానసిక సమస్యలపై ఆ దేశానికి చెందిన కీలక వ్యక్తులు కూడా సమాచారం లీక్ చేస్తున్నారు. అయితే అదంతా దుష్ప్రచారంగానే రష్యా కొట్టిపారేస్తోంది. కానీ రోజురోజుకు పుతిన్ ఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తోందని, కేన్సర్ వ్యాధి ముది రిపోతోందని, మహా అయితే ఆయన జీవితకాలం మూడేళ్లకు మించి ఉండకపోవచ్చని వైద్యవర్గాలు చెబుతున్నట్లు విదేశీ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే ఆయనకు తీవ్రమైన తలనొప్పి వేధిస్తోందని, కంటిచూపు ఇప్పటికే మందగించిందని, రానురాను పూర్తిగా దృష్టిని కోల్పోతారని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బీ) ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో నివసిస్తున్న రష్యా మాజీ గూఢచారి బోరిస్ కర్పిచ్‌కోవ్ ఇచ్చిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఈ కథనాలు ప్రచురితమైనాయి. ప్రస్తుతం ప్రసంగాల సందర్భంగా, టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు పుతిన్ ఇబ్బంది పడకుండా పెద్దపెద్ద అక్షరాలతో రాసిన ప్రసంగ పాఠం ప్రతులను ఇవ్వడం వల్ల ఆయన చూసి మాట్లాడగలుగుతున్నారని, మునుముందు కంటిచూపును పూర్తిగా కోల్పోతారని కర్పిచ్‌కోవ్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.
ప్రస్తుతం ఒక్కో కాగితంపై కేవలం రెండు వాక్యాలు మాత్రమే పట్టేలా పెద్ద అక్షరాలతో రాయాల్సి వస్తోందని ఆయన చెప్పినట్లు ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. ఇప్పటికే చేతి భాగాలు, ఒక కాలు బాగా వణుకుతున్నాయని, ముందుముందు కదలలేని పరిస్థితి రావొచ్చని వివరించింది. ఇటీవలే కొన్ని శస్త్రచికిత్సలు చేశారని, ఆ సమయంలో ఆయన పూర్తిగా కదలలేని స్థితిలో ఉన్నారని, అందువల్ల ఎఫ్‌ఎస్‌బీ మాజీ చీఫ్, పుతిన్‌కు అత్యంత విశ్వసనీయుడు నికోలాయ్ పత్రుషెవ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినట్లు రష్యాలో పేరుమోసిన టెలిగ్రామ్ చానల్ జనరల్ ఎస్‌వీఆర్ కథనం పేర్కొంది. పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అటు బ్రిటన్ ఇంటెలిజెన్స్ పదేపదే చెబుతోంది. అయితే, పుతిన్ ఆరోగ్యం భేషుగ్గా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లవరోవ్ గట్టిగా చెబుతున్నారు. వివిధ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు, టీవీ ప్రసంగాల్లో పుతిన్‌ను చూసి ఆయన ఆరోగ్యం ఎవరికివారు అభిప్రాయానికి రావొచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..