ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైన 83 రోజుల తరువాత పుతిన్ సేనలు చెప్పుకో దగ్గ విజయాన్ని సాధించాయి. అజోవ్ సముద్ర తీరంలోని అతిపెద్ద పారిశ్రామిక, పోర్టు నగరం మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు రెండునెలల క్రితం నగరమంతా స్వాధీనం అయినప్పటికీ యూరోప్‌లోనే అతిపెద్దదైన మరియపోల్ అజోవత్సల్ స్టీల్‌ప్లాంట్‌లో మోహరించిన ఉక్రెయిన్ సైనికుల ప్రతిఘటనతో ఒక పట్టాన విజయం సాధ్యం కాలేదు. మరియపోల్‌ను స్వాధీనం చేసుకున్నామని కొద్దివారాల క్రితం పుతిన్ ప్రకటన చేసినప్పటికీ ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో పట్టు చిక్కలేదు. ఎట్టకేలకు మంగళవారంనాడు స్టీల్‌ప్లాంట్‌లోని ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయిన నేపథ్యంలో రష్యా పైచేయి సాధించినట్టయింది. సోమవారంనాడు 260మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయారని రష్యా వెల్లడించగా, వారు లొంగిపోలేదని, గాయపడటంతో సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది. కాగా మంగళవారం పొద్దుపోయాక మరో వెయ్యిమంది సైనికులు ఆయుధాలు విడిచి బయటకు వచ్చారు. వీరందరినీ రష్యా భూభాగంలోకి భారీ భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో క్రెవ్లిున్ తరలించింది. దాదాపు ఏడు బస్సుల్లో ఉక్రెయిన్ సైనికులను మరియపోల్‌కు 80 కి.మి. దూరంలోని ఒలినివ్‌కా పట్టణానికి తరలించారు. ఈ పట్టణం రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉంది. కాగా ఉక్రెయిన్ సైనికులను యుద్ధనేరస్థులుగా విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. అయితే, ఉక్రెయిన్ వాదన వేరేగా ఉంది. రష్యా ఆధీనంలో ఉన్న తమ సైనికులను అంతర్జాతీయ చట్టాల ప్రకారం అప్పగించాలని, ప్రతిగా రష్యా సైనికులను తాము తిరిగి అప్పగిస్తామని ఉక్రెయిన్ కోరుతోంది. వారిని కాపాడుకోవడం మా బాధ్యతన్న ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్ స్కీ రెజ్నికోవ్ వారిని అప్పగించేందుకు అంతర్జాతీయ ప్రముఖుల మధ్యవర్తిత్వంతో ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు లేదు. ఉక్రెయిన్ సైనికులను ఆ దేశానికి అప్పగించాలా, యుద్ధ నేరస్థులుగా విచారణ చేయాలా అన్న దానిపై రష్యా పార్లమెంట్ బుధ, గురువారాల్లో ఓ నిర్ణయం తీసుకోనుంది. రష్యాను ముప్పుతిప్పలు పెట్టిన ఉక్రెయిన్ సైనికులు మరణశిక్షకు అర్హులని రష్యా రక్షణశాఖకు చెందిన ఉన్నతాధికారి మంగళవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో రష్యా వైఖరి ఎలా ఉంటుందో తేటతెల్లమవనుంది. కాగా యుద్ధ ఖైదీలను అప్పగించే అవకాశాలు తక్కువేనని రష్యా పార్లమెంట్‌లోని దిగువసభ స్పీకర్ వ్యాచెస్లావ్ వొలొదిన్ పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో మరికొందరు సైనికులు ఉన్నారని, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.
రష్యాకు ఎన్నో ప్రయోజనాలు..
ఉక్రెయిన్ నుంచి రష్యన్లు అధికంగా ఉండే ప్రాంతాలకు విముక్తి కల్పించేందుకే దండయాత్ర ప్రారంభించామని ప్రకటించిన పుతిన్ అనుకున్నట్టే విజయం సాధించారు. కాకపోతే కాస్త ఆలస్యమైంది. రష్యా దాడుల్లో మరియపోల్ ఇప్పటికే పూర్తిగా ధంసమైంది. 40 లక్షల జనాభా ఉండే ఈ నగరం ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా తయారైంది. 2014లో రష్యా సాధీనం చేసుకున్న క్రిమియాతో భూమార్గంలో అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు వీలవుతుంది. రష్యన్ల జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో రష్యా పట్టు సాధించడం విశేషం. కాగా మరో కీలక నగరం డోన్‌బాస్‌లో ముందుకువెడుతున్న రష్యాకు మరియపోల్ విజయం కలసిరానుంది. కీవ్, ఖార్కీవ్‌లో ఎదురుదెబ్బలు తిని పలాయనం చిత్తగించిన రష్యాకు ఇప్పుడు చెప్పుకోవడానికి ఓ విజయం దక్కినట్టయింది. 11 కి.మి. పరిథిలో విస్తరించిన స్టీల్‌ప్లాంట్‌లో మోహరించిన అజోవ్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు 83 రోజులుగా రష్యాను నిలువరించారు. అయితే వారిని తీవ్రవాదులుగా రష్యా పరిగణిస్తోంది. క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుని అనుకూల వేర్పాటువాదుల చేతికి అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరియపోల్, డోన్‌బాస్ ప్రాంతాలను క్రిమియాతో అనుసంధానం చేసి పాలన చేపట్టేందుకు ఎత్తులు వేస్తోంది.
కొనసాగిన దాడులు..
మరోవైపు మంగళ, బుధవారాల్లో రష్యా దాడులు కొనసాగాయి. డోన్‌బాస్. డోనెట్‌స్క్, లుషాంక్ ప్రాంతాల్లోని 45 సెటిల్‌మెంట్ ఏరియాలపై రష్యా బాంబులతో దాడి చేసిందని ఉక్రెయిన్ సైనిక దళాలు ప్రకటించాయి. కాగా రష్యా వైమానిక దాడులతో నగరంలోని ఓ పరిశ్రమ తగలబడిపోయిందని డోనెట్‌స్క్ గవర్నర్ పావ్‌లో వెల్లడించారు. 36 మంది పౌరులతో వెడుతున్న బస్సుపై రష్యా రాకెట్లతో దాడి చేసిందని లుషాంక్ గవర్నర్ సెర్హీ హైడాయ్ తెలిపారు. లెవివ్, సుమి, చెర్నీవ్ ప్రాంతాల్లో రష్యా క్షిపణి దాడులకు పాల్పడిందని, రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్ పట్టణాలను స్వాధీనం చేసుకునేందుకు కుట్రలు పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. కాగా మెలిటోపోల్‌లో రష్యాకు చెందిన అత్యున్నత సైనికాధికారులు, జనరల్స్‌ను పెద్దసంఖ్యలో ఉక్రెయిన్ గెరిల్లా దళాలు మట్టుబెట్టాయి.కాగా బెల్‌గొరోడ్, కుర్‌స్క్ ప్రాంతాలపై ఉక్రెయిన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిందని రష్యా ప్రత్యారోపణలు చేసింది. కాగా ఉక్రెయిన్ ప్రయోగించే డ్రోన్లను కాల్చేసే కొత్తతరం లేజర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నామని రష్యా బుధవారం ప్రకటించింది.
శాంతి చర్చలపై ప్రతిష్ఠంభన..
శాంతిచర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని, చర్చలపై ఉక్రెయిన్ అనాసక్తివల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రష్యా ఆరోపించింది. క్రెవ్లిున్ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్‌కోవ్ బుధవారం మాట్లాడుతూ శాంతి సాధనపై ఆ దేశానికి ఏమాత్రం ఆసక్తి లేదని ఆరోపించారు. ఏ రూపంలో చర్చలకూ ఉక్రెయిన్ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని, వాస్తవానికి చర్చలనుంచి ఆ దేశం తప్పుకుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి అండ్రీ రుడెన్‌కో అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..