పుతిన్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. బ్లడ్ క్యాన్సర్, పార్కిన్సన్ వ్యాధితో ఆయన సతమతమవుతున్నాడని, ఇటీవలే కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ వీడియో పుతిన్ ఆరోగ్యస్థితి మరింత దిగజారిందని తేటతెల్లం చేస్తోంది. ఈ వీడియోను న్యూయార్క్ పోస్ట్ పత్రిక విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన కాళ్లు, చేతులు బాగా వణుకుతున్నాయని, కదలకుండా నిలబడలేని స్థితిలో ఉన్నారని స్పష్టమవుతోంది. ఆదివారంనాడు సినీ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న పుతిన్ నిలబడి మాట్లాడేటప్పుడు చాలా ఇబ్బంది పడినట్లు ఆ వీడియోలో కన్పించింది. క్రెవ్లిున్లో జరిగిన కార్యక్రమంలో సినీ నిర్మాత నికిత మిఖాయిలోవ్కు ఆయన స్టేట్ ప్రైజ్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పోడియం దగ్గర నిలబడి మాట్లాడారు. స్థిరంగా నిలబడలేకపోవడం, అటూ ఇటూ కాళ్లు కదలడం, చేతులు వణకడం ఆ వీడియోలో కన్పించింది.
రష్యాలో పేరుమోసిన టెలిగ్రామ్ చానల్ జనరల్ ఎస్వీఆర్ సహా అనేక సంస్థలు పుతిన్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కాగా పుతిన్ విదేశాలకు వెళ్లినపుడు ఆయనకు సంబంధించిన మలమూత్రాలను ప్రత్యేక బృందం సేకరించి మాస్కోకు తరలించేవారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయా దేశాల వేగులకు అవి దొరికితే పరీక్షల ద్వారా పుతిన్ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే ప్రమాదం ఉందని క్రెవ్లిున్ ఈ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. రష్యావిక్టరీ దినోత్సవ వేడుకల్లోను, అంతకుముందు బెలారస్ అధ్యక్షుడు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రముఖులతో భేటీ సందర్భంగానూ పుతిన్ తీవ్ర అసౌకర్యానికి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం క్షీణించడంతో తరచూ ప్రజలముందుకు రావద్దని, సుదీర్ఘ సమీక్షలు జరపొద్దని, వీలైనంత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు పుతిన్‌కు సంపన్న మిత్రులు (ఓలిగర్స్) బయటపెట్టారు.