Friday, November 22, 2024

Big Story : యుద్ధ వైఫల్యంతో పుతిన్‌ ఉక్కిరిబిక్కిరి, అధికారంపై బెంగ.. క్షీణిస్తున్న ఆరోగ్యం

ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓటమి ఛాయలు, ఇంకొకవైపు దేశీయంగా వ్యతిరేకత.. ఇలా వరుస సవాళ్లమధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వైఫల్యాల నుంచి బయటపడేందుకు ఆయన ముందు శక్తివంతమైన ప్రత్యామ్నాయాలేవీ కనబడటం లేదు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి బయటకు రావడానికి మెరుగైన మార్గం లేకుండా పోయింది. ప్రస్త్తుత దశలో ఆయన ముందున్న ఎంపికల్లో, అణ్వస్త్రాలను ఉపయోగించడం లేదా ఓటమిని అంగీకరించడం మాత్రమే మిగిలివున్నాయి. ఒకవేళ ఓటమిని అంగీకరిస్తే, ఫిబ్రవరిలో తన బలగాలు ఆక్రమించిన ఉక్రెయిన్‌ ప్రాంతాలను తిరిగి అప్పగించడం అనివార్యమవుతుంది. ఈ సంక్లిష్ట వ్యూహాలు, సమస్యల మధ్య పుతిన్‌ సంయమనం కోల్పోతున్నాడని క్రెవ్లిున్‌ వర్గాలు చెబుతున్నాయి. రష్యా సాయుధ బలగాలతోపాటు వేర్పాటువాద యోధులు, పుతిన్‌ అనుకూల ప్రైవేట్‌ సైన్యాల్లో మరణించిన వారి సంఖ్య దాదాపు 65,000కు చేరుకుందని ‘అంతర్గత’ సమాచారాన్ని అందించే ప్రతిపక్ష సోర్స్‌ జనరల్‌ ఎస్‌విఆర్‌ టెలిగ్రామ్‌ ఛానెల్‌ తెలిపింది.

అదే సమయంలో, ఉక్రేనియన్‌ మిలిటరీ ప్రతిదాడి ‘సమర్థవంతంగా’ ఉంటోందని రష్యా డిఫెన్స్‌ చీఫ్‌లు స్పష్టంచేశారు. అలాంటి ఫలితం అధ్యక్ష పదవికి ముప్పు కలిగిస్తుంది. ఇది అవమానకరమైన, అణిచివేత ఓటమిగా పరిగణించబడుతుందని వారు హెచ్చరించినట్లు సమాచారం. ఇంకొకవైపు పుతిన్‌ ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోంది. వ్యక్తిగత సమావేశాలు నిర్వహించలేని, పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనలేని నిస్సహాయ స్థితికి చేరుతున్నారు అని టెలిగ్రామ్‌ చానల్‌ వెల్లడించింది. అతను క్యాన్సర్‌, ఇతర తీవ్రమైన వైద్య సమస్యలతో బాధపడుతున్నాడని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తన భద్రత, రక్షణ సహాయకులతో యుద్ధ పరిణామాలపై పుతిన్‌ చర్చించారట. ఇందులో వివిధ పరిష్కార మార్గాలను చర్చించారని సమాచారం. ఖేర్సన్‌, జపోరిజ్జియా, ఖార్కివ్‌తోపాటు లుహాన్స్‌, డొనెట్స్క్‌ ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌’లలోని భూమిని తిరిగి ఇవ్వడం గురించి కూడా చర్చించబడింది. అయితే ఇలాంటి చర్య పుతిన్‌ అధికారానికి ముగింపు పలుకుతుందనే భయాలను తెరపైకి తెచ్చింది. పుతిన్‌ను ఇంత భారీ నష్టాలకు దారితీసిన వ్యూహాలకు మిలిటరీ చీఫ్‌లు కూడా కారణమని నివేదిక వాదించింది. మొత్తంగా ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలని సన్నిహిత పుతిన్‌ క్రోనీ, హార్డ్‌లైనర్‌ నికోలాయ్‌ పట్రుషెవ్‌ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement