నాగపూర్ – మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో ‘పుష్ప 2’ అర్థరాత్రి షోను వీక్షిస్తున్న సినీ ప్రేక్షకులకు షాక్ ఎదురైంది! సినిమా ప్లే అవుతుండగా, బయట నుంచి పోలీసులు ఒక్కసారి లోపలికి దూసుకొచ్చారు. అనంతరం హత్య, మాదకద్రవ్యాల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
ఇదీ జరిగింది..
పుష్ప 2 ఆడుతున్న థియేటర్లో నుంచి విశాల్ మెష్రామ్ అనే డ్రగ్ స్మగ్లర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలలుగా పరారీలో ఉన్న మెష్రామ్ ఇటీవల విడుదలైన పుష్ప 2ని చూసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకున్నట్లు పచ్పౌలి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.
సైబర్ నిఘాను ఉపయోగించి కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్ యూవీ)లో అతని కదలికలను ట్రాక్ చేస్తూ అధికారులు గాలించారు. పుష్ప మూవీకి వస్తున్నాడని తెలుసుకున్నపోలీసులు ఆ థియేటర్ వద్ద భారీగా మోహరించారు.. మెష్రామ్ని ట్రాక్ చేసిన పోలీసులు అతను తప్పించుకోకుండా ఉండేందుకు నగరం నడిబొడ్డున ఉన్న సినిమా హాలు వెలుపల వాహనం టైర్లలో గాలిని తీసేశారు. మెష్రామ్ సినిమాలో లీనమైన అనంతరం పోలీసులు హాల్లోకి ప్రవేశించారు. ప్రతిఘటించే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అతడిని చుట్టుముట్టి వేగంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న మెష్రామ్ని త్వరలోనే నాసిక్‌లోని జైలుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.