ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా భాజపా నేత పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్‌ను ఎన్నుకున్నారు. పుష్కర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసింది. దీంతో నూతన సీఎంను ఎన్నుకునేందుకు ఉత్తరాఖండ్ భాజపా ఎమ్మెల్యేలు దేహ్రాదూన్‌లో శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ కూడా పాల్గొన్నారు. తొలుత సీఎం రేసులో సత్పాల్ మహారాజ్, ధనసింగ్ రావత్ పేర్లు ప్రధానంగా వినిపించాయి.
అయితే గత అనుభవం దృష్ట్యా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే అధిష్ఠానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో పుష్కర్ సింగ్ ధామిని తదుపరి సీఎంగా ఎన్నుకున్నారు. ధామి.. ఉదమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.