Friday, November 22, 2024

Delhi | కేంద్ర మంత్రి నిర్మలతో పురందేశ్వరి భేటీ.. పార్టీ పెద్దలతోనూ మంతనాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి మించి అడ్డదారుల్లో అప్పులు చేస్తోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు డి. పురందేశ్వరి ఆరోపించారు. గురువారం పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కలిసి పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఆమెతో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కొన్ని గణాంకాలతో సహా రాసిన లేఖను ఆమెకు అందజేశారు. అనంతరం ఢిల్లీలోని ఆమె నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత పార్టీ సంస్థాగత మార్పుల గురించి పార్టీ పెద్దలతో చర్చించానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర పార్టీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు తెలిపారు. సమర్థతకు పెద్దపీట వేస్తూ పాత, కొత్తల మేళవింపుగా ఈ కార్యవర్గం ఉంటుందని అన్నారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రుణాల గురించి మాట్లాడుతూ.. 2023 జులై నాటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం మొత్తం రూ. 10,77,006 కోట్లు ఉందని పురందేశ్వరి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని చెప్పారు. కార్పొరేషన్ల పేరుతో చేసిన రుణాలు అధికారికమా, అనధికారికమా అన్నది ఏపీ ప్రజలకు తెలియాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు కాంట్రాక్టర్లకు రూ. 71 వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా పెండింగులో ఉంచిందని.

అసలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బు లేని స్థితిలో రాష్ట్ర ఖజానా ఉందని విమర్శించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో పంచాయితీలకు కేటాయించిన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని, అధికార పార్టీతో పాటు అన్ని పార్టీల సర్పంచులు ఈ అంశంపై ఆందోళన చేస్తున్నారని పురందేశ్వరి అన్నారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల కోసం చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్), ఈఎస్ఐ నిధులను కూడా దారిమళ్లించి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. నిధులన్నీ దారి మళ్లించి ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపుతోందని మండిపడ్డారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రుణాలు తీసుకుంటుందని, కాకపోతే అవి ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి లోబడి ఉంటాయని పురందేశ్వరి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా ఎఫ్.ఆర్.బీ.ఎం కళ్లుగప్పి కార్పొరేషన్ల పేరుతో రుణాలు చేస్తోందని అన్నారు. మరోవైపు నాసిరకం మద్యంతో రాష్ట్ర ప్రజల జేబులు, ఆరోగ్యాలు గుల్ల చేస్తూ సంక్షేమం అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు. ఇదంతా తొడపాశం పెట్టి బుగ్గలు నిమిరినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement