Friday, November 22, 2024

Delhi | మద్యం అమ్మకాలపై సీబీఐ దర్యాప్తు జరిపించండి.. అమిత్ షా ను కోరిన పురందేశ్వరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురందేశ్వరి కేంద్రాన్ని కోరారు. ఆదివారం ఢిల్లీ చేరుకున్న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల్లో భారీస్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ ఓ లేఖను అందజేశారు. చీప్ లిక్కర్ అమ్మకాల ద్వారా ప్రజల ప్రాణాలు బలవడంతో పాటు ఫ్లడ్ గేట్లను ఎత్తిన మాదిరిగా అవినీతి జరుగుతోందని లేఖలో విమర్శించారు.

ముఖ్యమంత్రి, ఆయన అనుయాయుల జేబులు నింపేలా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గతంలో మద్యం దుకాణాలను వేలం పద్దతిలో కేటాయించేవారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే దుకాణాలను నిర్వహిస్తోందని తెలిపారు. మద్యం తయారీ పరిశ్రమలను వైఎస్సార్సీపీ నేతలే హస్తగతం చేసుకున్నారని తెలిపారు. ఓ మద్యం తయారీ సంస్థలో వైఎస్సార్సీపీ నేతను భాగస్వామిగా చేర్చుకోడానికి నిరాకరించినందుకు బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ సంస్థ నుంచి మద్యం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసిందని ఉదహరించారు.

- Advertisement -

డిస్టిలేషన్ ప్రక్రియ కూడా సరిగా జరగడం లేదని, తద్వారా ఆరోగ్యానికి హానికల్గించే పదార్థాలతోనే మద్యం తయారీ జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు 80% అమ్మకాలు నగదు లావాదేవీలతోనే జరుగుతున్నాయని, డిజిటల్ చెల్లింపులు జరగడం లేదని తెలిపారు. ఇది భారీస్థాయి అవినీతికి ఆస్కారం కల్గిస్తోందని అన్నారు. ఒక దుకాణాన్ని సందర్శించి పరిశీలిస్తే.. అక్కడ రూ. 1 లక్ష మేర అమ్మకాలు జరిగాయని, అందులో కేవలం రూ. 700 మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగ్గా, మిగతాదంతా నగదు రూపంలో జరిగిన లావాదేవీలే అని వెల్లడించారు.

ఏడాదికి రూ. 57వేల కోట్ల విక్రయాలు

కొన్ని గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 80 లక్షల మంది ప్రతిరోజూ మద్యం సేవిస్తారని, సగటున ఒక మనిషి రూ. 200 విలువ చేసే మద్యం కొనుగోళ్లు చేస్తారని ఉజ్జాయింపుగా గణిస్తే.. రోజుకు రూ. 160 కోట్ల విలువైన అమ్మకాలు జరుగుతాయని అన్నారు. ఆ లెక్కన నెలకు రూ. 4,800 కోట్లు, ఏడాదికి రూ. 57, 600 కోట్ల విలువైన విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం ఇచ్చిన సమాచారం ప్రకారం ఏడాదికి రూ. 32,000 విలువైన విక్రయాలు జరుగుతున్నాయని, మిగతా రూ. 25 వేల కోట్లు వ్యవస్థ నుంచి పక్కదారి పడుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు.

మద్యం సేవించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య గత రెండేళ్లలోనే 25%  పెరిగాయని పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు. తాను స్వయంగా ఆస్పత్రులు సందర్శించి ఈ వివరాలు తెలుసుకున్నానని, ఈ పరిస్థితుల్లో మద్యం విక్రయాల్లో చోటుచేసుకుంటున్న అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె అమిత్ షాను కోరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement