ఢిల్లిలోని పాక్ హైకమిషన్ అధికారులపై పంజాబ్ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. వీసా కోసం వెళితే అక్కడి సిబ్బంది తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని తనకు డబ్బు ఆశ చూపారని పేర్కొన్నారు. దీనిపై పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. పంజాబ్‌లోని ఓ యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ 2021లో ఓకాలేజీలో లెక్చర్ ఇవ్వడానికి వీసా కోసం ప్రయత్నించారు. ఇందుకోసం ఢిల్లిలోని పాక్ హైకమిషన్‌లో వీసా ఇంటర్వ్యూ బుక్‌చేశారు.
ఇంటర్వ్యూకి వెళ్లిన ఆమెను, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని, అందుకు తగినంత డబ్బు ఇస్తామని ఆశచూపారని సదరు మహిళ ఆరోపించింది. ఇందుకు తాను అంగీకరించక పోవడంతో వీసా మంజూరు చేయలేదని తెలిపారు. ఎంబసీ నుంచి బయటకు వస్తుండగా, ఓ అధికారి సాయం పేరుతో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది. వీసా కావాలంటే లైంగిక కోర్కెలు తీర్చాలంటూ ద్వంద్వార్థాలతో ప్రశ్నించారని ఆరోపించారు. దీనిపై పాక్ విదేశాంగ మంత్రికి లేఖ రాసినా ప్రయోజనం కనిపించలేదని పేర్కొంది.