కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ దేశాలు అనుమతి నిరాకరిస్తున్నాయి. భారత్ లో తయారైన కొవిషీల్డ్ తీసుకుని యూరప్ వెళుతున్నవారికి అక్కడి దేశాలు గ్రీన్ పాస్ రూపంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్ పాస్ జాబితాలో లేని టీకాలు తీసుకున్నవారిని ఈయూ దేశాలు అనుమతించడంలేదు. దీనిపై సీరం సంస్థ ఆదార్ పూనావాలా స్పందించారు. అత్యున్నత స్థాయిలో ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన చెప్పారు. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయుల గురించి యురోపియన్ యూనియన్‌లో ఉన్న నేతలతో చర్చించినట్లు చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ టీకాలను సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కోవీషీల్డ్‌కు ఇంకా ఈయూ అనుమతి దక్కలేదు. దీంతో యురోపియన్ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమస్యలను పరిష్కరించనున్నట్లు పూనావాలా తెలిపారు. ఈయూ ఔషధ నియంత్రణాధికారులతో పాటు, దౌత్యపరమైన రీతిలోనూ ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు సీరం సీఈవో తెలిపారు. ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్‌లో వాక్స్‌జెవ్రియా పేరుతో కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. ఆ టీకాతో పాటు ఫైజర్, మోడెర్నా, జే అండ్ జే టీకాలకు మాత్రమే ఈయూలో గుర్తింపు ఉంది.