పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొన్నటి వరకు సీఎంగా పనిచేసిన అభ్యర్థిని కాంగ్రెస్ హైకమాండ్ పక్కనబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఎన్నికల్లో నారాయణస్వామి పోటీ చేయడం లేదని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి దినేశ్ గూండూరావు ప్రకటించారు. ఎన్నికల ప్రచారం, ఎలక్షన్ మేనేజ్ మెంట్‌కే ఆయన పరిమితమవుతారని వెల్లడించారు. 14 మంది పేర్లతో తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీరిలో సెల్వనదనె, ఎం కన్నన్, కార్తికేయన్ వంటి ప్రముఖులు ఉన్నారు. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.
గత నెల 22న ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి రాజీనామా చేశారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో ఆయన విఫలం కావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.