పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ప్రముఖ సినీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. చిన్నతనం నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకున్న ఈశ్వర్ స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మ వేసి చిన్నతనంలో అందరి ప్రశంసలు అందుకున్నారు. బొమ్మలు గీయడంలోనే కెరియర్‌ను వెతుక్కోవాలని భావించిన ఈశ్వర్ కాకినాడలో చదువుతున్న పాలిటెక్నిక్ చదువుకు మధ్యలోనే ఫుల్‌స్టాప్ పెట్టేసి మద్రాస్‌కు చేరుకున్నారు.
ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌లో ఈశ్వర్ మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత తన పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీ ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు బాపు రూపొందించిన ‘సాక్షి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో పబ్లిసిటీ పనులు ప్రారంభించారు. ఆ సినిమా కోసం కలర్ పోస్టర్లు, లోగో తయారు చేశారు. ‘పాప కోసం’ సినిమాకు బ్రష్ తో కాకుండా, నైఫ్ వర్క్‌తో పోస్టర్లు రూపొందించి గుర్తింపు పొందారు. హిందీ, తమిళ వెర్షన్లకూ అలాంటి పోస్టర్లే రూపొందించారు.