శ్రీకాకుళం : 16 నెలల పాటు ప్రజా సంకల్ప యాత్రను జగన్మోహన్ రెడ్డి చేపట్టారని, పాద యాత్రలో భాగంగా గుర్తించిన ప్రజల కష్ట నష్టాలను తీర్చేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అనూహ్య రీతిలో మానవీయ మార్పును సాధించారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైసీపీ సర్కారు కారణంగానే ప్రజలకు గౌరవనీయ జీవితం దక్కిందని, పేదలకు ముఖ్యంగా బడుగులకు ఆర్థిక ఆసరా దక్కిందని, తలవొంచుకుని బతికే పరిస్థితే లేకుండా పోయిందని అన్నారు .. గార మండలం, వమరవల్లిలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ సచివాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. రానున్న కాలంలో కూడా మీకు మంచి జరగాలంటే మేలు చేసే ప్రభుత్వాన్నేఎన్నుకోండి.. మీకు హాని చేసే వారికి దూరంగా ఉండండి.. పథకాలతోనే సంక్షేమం సాధ్యం… అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
అదంతా మీ ఇష్టం.. ఓటు కోసం కాదు..
ముందు తరాల బాగు కోసం సంక్షేమం…
మానవీయ మార్పు అన్నది పథకాల అమలుతోనే సాధ్యం.. మీ కన్నీరు తుడవడానికీ, మీ ఆకలి తీర్చడానికీ, మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు ఈ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఓట్లేయండి, మానేయండి అది మీ ఇష్టం. పథకాల అమలు, వాటి ద్వారా డబ్బు పంచడం అన్నవి అన్యాయం అనేవారికి ఓటేస్తారా..? మీరు గౌరవంగా బతికేందుకు నిశ్చింతగా బతికేందుకు వీలున్నంతవరకూ సాయం చేస్తున్న వారికి అవకాశం ఇస్తారా..? మీ ఇష్టమన్నారు.