Saturday, September 21, 2024

TG | ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం : కేటిఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని అన్నారు.

పారిశ్యుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా తీవ్రమైన దోమల బెడద కారణంగా డెంగీ సహా విజృంభిస్తున్న విష జ్వరాలతో జనం పరేషాన్ అవుతున్నార‌ని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నా మీ ప్రభుత్వానికి క‌నిపించ‌డంలేదా అని ప్రశ్నించారు.

అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో దాదాపుగా 5,700 డెంగీ కేసులు నమోదయ్యాయని, కానీ అనధికారికంగా దీనికి పది రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని తెలిపారు. డెంగీకి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమన్నారు.

అత్యంత ప్రాధాన్యమైన ప్రజా ఆరోగ్యం అంటే ఈ ముఖ్యమంత్రికి పట్టింపు లేదా కేటీఆర్ నిలదీశారు. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని కేటీఆర్ అన్నారు. పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని కేటీఆర్ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా ఇతర విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement