Tuesday, November 26, 2024

ISRO | పీఎస్‌ఎల్వీ సీ58 కౌంట్‌డౌన్‌ షురూ! రేపు ఉ. 9.10గం.లకు నింగిలోకి రాకెట్‌

సూళ్లూరుపేట(శ్రీహరికోట), ప్రభన్యూస్‌ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇస్రో విజయాశ్వంగా పిలుబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని 60 రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ -సీ58 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. కొత్త ఏడాదిలో తొలిరోజే సరికొత్త ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. న్యూఇయర్‌ రోజునే నింగిలోకి రాకెట్‌ను పంపేలా శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.

యుఆర్‌ శాటిలైట్‌ సెంటర్‌ సహకారంతో రామన్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. బ్లాక్‌ హోల్స్‌ (కృష్ణ బిలాలు), న్యూట్రాన్‌ స్టార్స్‌ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్‌ స్టార్స్‌ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్‌ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్‌ చేపడుతోంది. ఈ ఎక్స్‌పో శాట్‌ శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.

విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమానమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్‌రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్‌ నక్షత్రాలు, నాన్‌థర్మల్‌ సూపర్‌నోవాల అవశేషాలు ఉన్నాయి. ఈ ఎక్స్‌పోశాట్‌ శాటిలైట్‌ కనీసం ఐదేళ్ల పాటు- తన పరిశోధనను నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. అలాగే కేరళ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన వీఐవై నానాశాట్‌లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపనున్నారు.

ఎక్స్‌పోశాట్‌ను కక్ష్యలోకి వదిలిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది. పీఎస్‌ఎల్వీ- సిీ 58 వాహక నౌక ద్వారా మనదేశానికి చెందిన 480 కిలోల ఎక్స్‌పోశాట్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. అంత్యంత జాగ్రత్తగా పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 25గంటల పాటు కొనసాగనుంది. సోమవారం ఉదయం 9.10గంటలకు నింగిలోకి ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ తీసుకువెళ్లనుంది. ఇందుకు సంబంధించిన ఇంధనాన్ని నింపే ప్రక్రియలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు.

కౌంట్‌డౌన్‌ పూర్తి అయిన తర్వాత నింగికెక్కుపెట్టిన బాణంలా పీఎస్‌ఎల్‌వీ -సీ58 దూసుకెళ్లనుంది. ఇప్పటికే రాకెట్‌ను మొదటి ప్రయోగ వేదికకు చేరవేసిన శాస్త్రవేత్తలు రాకెట్‌ రిహార్సల్‌ను విజయవంతంగా నిర్వహించి ఎంఆర్‌ఆర్‌ సమావేశం, ల్యాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డులో ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చి ఆదివారం ఉదయం 8.10గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించారు. 25 గంటల పాటు నిర్విరామంగా కౌంట్‌డౌన్‌ ప్రక్రియను కొనసాగించిన తర్వాత సోమవారం ఉదయం 9.10గంటలకు కౌంట్‌డౌన్‌ 0కు చేరుకున్న వెంటనే పీఎస్‌ఎల్‌వీ -సీ58 రాకెట్‌ నారింజ రంగు నిప్పులు చిమ్ముతూ నింగికెక్కుపెట్టిన రామబాణంలా దూసుకెళ్లనుంది.

- Advertisement -

ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌..

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ 58 రాకెట్‌ ప్రయోగాన్ని పురష్కరించుకుని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ షార్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన శాస్త్రవేత్తలతో కలిసి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు.

శ్రీ చెంగాళమ్మను దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌

సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవిని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌ సోమనాధ్‌ ఆదివారం దర్శించుకున్నారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్‌ ప్రయోగాలు చేసే సమయంలో శ్రీ చెంగాళమ్మను దర్శించుకుంటే ప్రయోగం విజయవంతం అవుతుందని నమ్మకంతో ఇస్రో చైర్మన్‌లు ప్రయోగానికి ముందుగా అమ్మణ్ణిని దర్శించుకోవడం ఆనవాయితీ. సోమవారం పీఎస్‌ఎల్‌వీ -సీ58 రాకెట్‌ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ సోమనాధ్‌ ఆలయానికి చేరుకోవడంతో ఆయనకు ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం అమ్మణ్ణికి విశేష పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూపీఎస్‌ఎల్‌వీ- సీ58 రాకెట్‌ ప్రయోగం ద్వారా ఎక్స్‌ఫోశాట్‌ అనే ఉపగ్రహాన్ని పంపుతున్నట్లు- తెలియజేశారు. ఇది పూర్తిగా పరిశోధాత్మక ఉపగ్రహమన్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలలో ఇది 60 ప్రయోగమని తెలియజేశారు. 2024 కొత్త సంవత్సరంలో ఈ ప్రయోగం ద్వారా ప్రయోగాలకు శుభారంభం జరుగుతుంద న్నారు. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ సోమనాధ్‌ వెంట షార్‌ డైరెక్టర్‌ ఏ రాజరాజన్‌, గ్రూప్‌ డైరెక్టర్‌ గోపికృష్ణలు పాల్గొన్నారు.

కట్టుదిట్టమైన భద్రత

పీఎస్‌ఎల్‌వీ -సీ58 రాకెట్‌ ప్రయోగాన్ని పురస్కరించుకుని షార్‌లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో షార్‌లో పహారా కాస్తున్నారు. అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించి షార్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు సీఐఎస్‌ఎప్‌ బలగాలు, మరోవైపు పోలీసు బలగాలతో షార్‌లో భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement