సూళ్లూరుపేట (శ్రీహరికోట), ప్రభన్యూస్: శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్దం చేసింది. ఇస్రో విజయాశ్వంగా పిలువబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ -సీ55వ ద్వారా ఈ నెల 22న ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. గత నెల 10వ తేదీన పీఎస్‌ఎల్‌వీ -సీ55 రాకెట్ అనుసంధాన ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. సీఐఎఫ్‌లో ప్రారంభమైన రాకెట్ అనుసంధాన ప్రక్రియ మొదటి రెండు దశలలో రాకెట్‌ను సిద్దం చేసి ఈ నెల 5వ తేదీన షార్ లోని మొదటి ప్రయోగ వేదిక వద్దకు తరలించారు.
అక్కడ మూడు, నాలుగు దశల అనుసంధాన ప్రక్రియను పూర్తిచేసిన శాస్త్రవేత్తలు అగ్రభాగాన ఉష్ణకవచంలో 741 కిలోల బరువున్న సింగపూర్‌కు చెందిన టెలియోస్ -2 ఉపగ్ర హంతో పాటు 16 కిలోల మొలైట్ ఉపగ్రహాన్ని అర్చి పూర్తిస్థాయిలో రాకెట్‌ను ప్రయోగానికి సిద్దం చేశారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై నింగికెక్కుపెట్టిన బాణంలా ఉన్న పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌కు సంబంధించిన రిహార్సల్‌ను గురువారం శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ నివేదికలను ఎంఆర్‌ఆర్ (మిషన్ రెడినెస్ రివ్యూ) సమావేశాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్‌వీ -సీ55 ప్రయోగానికి సంసిద్దత వ్యక్తం చేయనున్నారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ప్రయోగానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వనుంది.
ఈ క్రమంలో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను 25.30 గంటల పాటు కొనసాగించనున్నారు. కౌంట్‌డౌన్ గురువారం మధ్యాహ్నం 2.19గంటలకు 0కు చేరుకోగానే నిప్పులు చిమ్మూతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ -సీ 55 దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను ఈనెల 21వ తేదీన 12.49 గంటలకు ప్రారంభించనున్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్‌వీ -సీ55 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్న నేపథ్యంలో షార్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.