Saturday, November 23, 2024

నేడు పీఎస్‌ఎల్‌వీ -సీ53 రాకెట్‌ ప్రయోగం.. ప్రారంభమైన కౌంట్‌డౌన్‌

శ్రీహరికోట (సూళ్లూరుపేట), ప్రభన్యూస్‌: మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియ లిమిటెడ్‌ ద్వారా పూర్తి వాణిజ్య పరంగా నిర్వహించనున్న ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 3 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో విజయాశ్వంగా పిలువబడే పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ -సీ53 ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్‌) ఇందుకు వేదికగా నిలిచింది. ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇప్పటికే వాహన అనుసంధాన భవనం నుంచి పీఎస్‌ఎల్‌వీ -సీ53 రాకెట్‌ను రెండవ ప్రయోగ వేదికపైకి శాస్త్రవేత్తలు చేరవేశారు.

రాకెట్‌ రిహార్సల్‌ను నిర్వహించిన అనంతరం ఎంఆర్‌ ఆర్‌ సమావేశాన్ని నిర్వహించి ప్రయోగానికి సంసిద్ధత వ్యక్తం చేసిన అనంతరం లాంచ్‌ ఆధరైజేషన్‌ బోర్డు ప్రయోగానికి పచ్చజెండా ఊపింది. దీంతో బుధవారం సాయంత్రం 4 గంటలకు షార్‌లో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 26 గంటల పాటు నిర్విరామంగా ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. కౌంట్‌డౌన్‌ సమయంలోనే నాలుగు దశల రాకెట్లో 4, 2 దశల మోటార్లలో ద్రవ ఇంధనాన్ని నింపారు. అనంతరం 1, 3 దశల మోటార్లకు ఘన ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. ఇంధనాన్ని నాలుగు దశలలో నింపిన అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రానిక్‌ వ్యవస్థల పనితీరును మరోసారి పరిశీలించనున్నారు.

ప్రయోగానికి సుమారు 30 నిమిషాల ముందు రాకెట్‌ను శాస్త్రవేత్తలు సూపర్‌ కంప్యూటర్‌ ఆధీనంలోకి తీసుకువెళ్లనున్నారు. సూపర్‌ కంప్యూటర్‌ ఆదేశాలతో కౌంట్‌డౌన్‌ 0కు చేరుకోగానే గురువారం సాయంత్రం 6 గంటలకు నారింజ రంగు నిప్పులు చిమ్ముతూ నింగికెక్కుపెట్టిన బాణం లా రోదసిలోకి దూసుకెళ్లనుంది.

ఇస్రో ఛైర్మన్‌ సోమనాధ్‌ పర్యవేక్షణలో ప్రయోగం
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుంచి చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ 53 రాకెట్‌ ప్రయోగాన్ని పురష్కరించుకుని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాధ్‌ శనివారం షార్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయన శాస్త్రవేత్తలతో కలిసి కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పరిశీలించి ప్రయోగ సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ముందుగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన అక్కడి నుంచి సూళ్లూరుపేటకు చేరుకుని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవిని దర్శించుకుని ఈ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. అనంతరం షార్‌కు చేరుకుని ప్రయోగ సన్నహాలను ఆయన పరిశీలించారు.

రాకెట్‌ ప్రయోగానికి పటిష్ట బందోబస్తు
శ్రీహరికోట షార్‌ కేంద్రం నుంచి నేడు రాకెట్‌ ప్రయోగం జరుగనున్న దృష్ట్యా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, పోలీసు బలగాలు భారీగా షార్‌కు చేరుకున్నాయి. పటిష్ట బందోబస్తు నడుమ పీఎస్‌ఎల్‌వీ -సీ53 ప్రయోగం జరుగనుంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక బలగాలు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

ప్రయోగాన్ని వీక్షించేందుకు అనుమతులు
గతంలో రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులను షార్‌ కేంద్రంలోకి అనుతించే వారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో షార్‌లోకి సందర్శకులను గత రెండేళ్లుగా అనుమతించిన అధికారులు గురువారం జరగనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ53 ప్రయోగాన్ని వీక్షించేందుకు అనుమతించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులు ప్రయోగాన్ని వీక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టారు. దీంతోపాటుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రయోగాన్ని వీక్షించే ఏర్పాట్లను ఇస్రో అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 5.30గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌, దూరదర్శనల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement