న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు రక్షణ కల్పించాలని తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ నుంచి వారికి హాని ఉందంటూ గురువారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 1న మూడు రాజధానులపై విశాఖలో నిర్వహించే చర్చా వేదిక పోస్టర్‌ను ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి సభ్యులు మద్దిపాటి వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ముందుగా రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపిన జగన్, ఆ తర్వాత మూడు రాజధానులంటూ తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బెయిల్‌పై బయట ఉన్న ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు అనాలోచితంగా ఉంటాయని చెప్పేందుకు ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయని ఆరోపించారు.
రైతులు చేపట్టిన “అమరావతి నుంచి అరసవెల్లి ” పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెల్యేల బృందం రైతుల పాదయాత్రను దయ్యాల యాత్ర అంటూ విమర్శిస్తున్నారని వాపోయారు. రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశిస్తే అడ్డుకుంటామని చెప్పడం ఎంతవరకు సబబని రామ్ ప్రశ్నించారు. అక్టోబర్ 23వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన పాయకరావుపేట ప్రాంతంలోకి రైతుల పాదయాత్ర చేరుకుంటుందని, రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. పాయకరావుపేట నుంచి అరసవెల్లి వరకు రైతులకు రక్షణ కల్పించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. వచ్చే నెల 23న పాదయాత్ర పాయకరావుపేటలో ప్రవేశించి నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో జరిగే బహిరంగ సభతో పూర్తవుతుందని రామ్ వెల్లడించారు.