Friday, November 22, 2024

ప్రతివాదులకు పిటిషన్ కాపీలు అందించండి.. ఆస్తుల విభజన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జనవరి రెండో వారానికి వాయిదా పడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ఎదుట ఈ కేసు విచారణకు రాగా పిటిషన్ కాపీలను ప్రతివాదులకు పంపించాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు దాటినా షెడ్యూల్ 9లో ఉన్న 89 సంస్థలు, షెడ్యూల్ 10లో 107 సంస్థల విభజన ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదని, త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తిచేసేలా ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ రెండు షెడ్యూళ్లలో పొందుపర్చిన సంస్థల మొత్తం విలువ రూ. 1,42,601 కోట్లు అని, వీటిలో 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇందులో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వెల్లడించింది. ఈ సంస్థల విభజన ఆలస్యంకావడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని తెలిపింది. విభజన అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని పిటిషన్లో పేర్కొంది. తక్షణమే సంస్థల విభజనకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement