Sunday, November 24, 2024

Delhi | చేరికలపై నిరసన గళం.. నగేష్‌కు సీటు ఇవ్వొద్దని విన్నపం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున టికెట్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో తమ నిరనస గళాన్ని వినిపించారు. ఆదివారం ఢిల్లీలో ఐదుగురు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం, వారికే టికెట్లు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో నేతలు బీజేపీ పెద్దలను కలిసి తమ అసమ్మతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కొత్తగా చేరిన మాజీ ఎంపీ జి. నగేశ్‌కు కేటాయించవద్దని కోరుతూ ఆ జిల్లా నేతలు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డా. కే. లక్ష్మణ్‌తో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కలిశారు.

ఈ నేతల బృందానికి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ నేతృత్వం వహించగా.. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు తదితరులు బృందంలో ఉన్నారు. బీజేపీ పెద్దలను కలిసిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చాలా మంది నేతలు మోదీ పాలనను చూసి బీజేపీలో చేరుతున్నారని, అలా చేరడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని రమేశ్ రాథోడ్ అన్నారు. అయితే చేరినవారికి వెంటనే టికెట్లు ఇవ్వడం మాత్రం సరికాదని, పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనన్నారు.

తెలంగాణలో బంజారా (లంబాడా) సామాజికవర్గం సంఖ్య రాష్ట్ర జనాభాలో 8 శాతం ఉన్నారని, లంబాడా, గోండ్, గిరిజన జాతులన్నీ కలిపి 3.5 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్‌లో లంబాడా వర్గానికి టికెట్ ఇస్తే గెలుస్తామని అన్నారు. తమ జన సంఖ్యను దృష్టిలో పెట్టుకుని టికెట్లు కేటాయించాలని అన్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకుందని అన్నారు. కొత్తగా చేరిన ఆదివాసీ నేత నగేశ్‌కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆదిలాబాద్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఒకటి ఆదివాసీలకు, ఒకటి బంజారాలకు ఇవ్వడం ప్రతి పార్టీ అనుసరిస్తున్న విధానం. అందులో భాగంగా మహబూబాబాద్‌కు బంజారా నేత సీతారాం నాయక్‌ను పరిశీలిస్తున్నట్టుగా కథనాలు రావడంతో ఆదిలాబాద్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఆ స్థానాన్ని ఆదివాసీ నేత నగేశ్‌కే ఇస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో వారంతా ఢిల్లీలో అధిష్టానం పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement