Wednesday, November 6, 2024

Delhi | ఫోన్‌ ట్యాపింగ్‌ నుంచి రక్షణ కల్పించాలి : వైఎస్సార్సీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు సంబంధించిన డేటాను తస్కరించే చర్యల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కాలంలో ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాలు అనేకం వెలుగుచూస్తున్న నేపధ్యంలో దీనిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

డేటా ప్రొటెక్షన్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేయాలంటే సర్వీసు ప్రొవైడర్‌ లేదా మొబైల్‌ టవర్‌ సహాయం అవసరం లేకుండా మొబైల్‌ ఫోన్‌లోని స్పీకర్‌, కెమెరా ద్వారా సంభాషణలను ట్యాప్‌ చేయడం, ఆ ఫోన్‌లోని డేటాను తస్కరించే సామర్ధ్యంతో అనేక విదేశీ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయని చెప్పారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు, ప్రభుత్వ విభాగాల వినియోగానికి మాత్రమే విక్రయించాలన్న షరతు ఉందని, ఈ సాఫ్ట్‌వేర్‌ 50 నుంచి 100 కోట్ల రూపాయలకు విక్రయిస్తారని, వార్షిక నిర్వహణ కోసం ఆ మొత్తంలో 20 శాతం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు ఈ సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా సంపాదించి ఫోన్‌ ట్యాపింగ్‌కు వినియోగిస్తున్నాయని, ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ విభాగాలు వినియోగించే ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని ప్రైవేట్‌ సంస్థలు చేజిక్కించుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆక్వా యూనివర్శిటీకి సహకరించండి

ఆక్వాకల్చర్‌పై ఆధారపడ్డ రైతులకు సైతం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన మాదిరిగా బీమా సదుపాయం కల్పించాలని విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒక లక్షా 38 వేల మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారని తెలిపారు. పరీక్షించిన రొయ్యలలో నిషేధించిన యాంటీబయోయటిక్స్‌ అవశేషాలు కనిపించినందునే వాటిని స్వీకరించడానికి ఆయా దేశాలు నిరాకరిస్తున్నాయని ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎగుమతి అయ్యే రొయ్యల కన్‌సైన్‌మెంట్లు తిరస్కారానికి గురి కాకుండా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014-19 మధ్య కాలంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన విధానాల కారణంగా ఆక్వాకల్చర్‌ రంగం సంక్షోభంలో పడిందని వాపోయారు. వైఎస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతో సంక్షోభం నుంచి అక్వా రంగాన్ని గట్టెక్కించారని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏర్పాటు చేస్తున్న ఆక్వాకల్చర్‌ యూనివర్శిటీకి అయ్యే ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు. అయితే ఈ యూనివర్శిటీ ఆవరణలో ఇంక్యుబేషన్‌ సెంటర్లు, స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ సెంట్లు, ఆక్వాపార్క్‌లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పడాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement