Thursday, November 21, 2024

Telangana | తట్టు నుంచి చిన్నారులకు రక్షణ.. ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ పంపిణీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తట్టు, కంటసర్పి (మీజిల్స్‌, రూబెల్లా) వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టీకాను వేయాలని నిర్ణయించింది. మీజిల్స్‌, రూబెల్లా కంటైనింగ్‌ వ్యాక్సిన్‌ (ఎంఆర్‌సీవీ) వ్యాక్సిన్‌ను ఇందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల నుంచి 5ఏళ్లలోపు చిన్నారులకు వేస్తున్నారు. ప్రత్యేకించి మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ టీకాను వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతోపాటు ఆ రాష్ట్ర రాజధాని ముంబైలో మీజిల్స్‌, రూబెల్లా వ్యాధి విజృంభిస్తున్న విషయం తెలిసిందే.

తట్టుగా పేర్కొనే ఈ వ్యాధితో పెద్ద సంఖ్యలో చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురవడంతోపాటు అక్కడకక్కడా మరణాలు కూడా పొరుగు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రాలన్నీ ఎంఆర్‌సీవీ వ్యాక్సిన్‌ను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ధృవీకరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఎంఆర్‌సీవీ వ్యాక్సిన్‌ పంపిణీని రాష్ట్రంలో మొదలుపెట్టింది. మహారాష్ట్రతోపాటు బీహార్‌, గుజరాత్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కేరళ రాష్ట్రాల్లోనూ తట్టు వ్యాధి కేసులు నమోదవుతున్నాయి.

ఎంఆర్‌సీవీ వ్యాక్సిన్‌ను రెండు డోస్‌లుగా పంపిణీ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మొదటి డోస్‌ను 9-12 నెలల చిన్నారులకు, రెండో డోస్‌ను 16-24 నెలల చిన్నారులకు వేయనున్నట్లు చెప్పారు. సాధారణంగా ప్రతి ఏటా నవంబరు నుంచి మార్చి వరకు రాష్ట్రంలోనూ తట్టు వ్యాధి కేసులు చిన్నారుల్లో నమోదవుతుంటాయి. అయితే ఈసారి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో 5ఏళ్లలోపు చిన్నారులందరికీ ఎంఆర్‌సీవీ వ్యాక్సిన్‌ను వేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement