న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మట్టి సాంద్రత మెరుగుపర్చినప్పుడే గ్రామీణ భారతం అభివృద్ధి సాధ్యమని సద్గురు జగ్గీవాసుదేవ్ అన్నారు. ‘సేవ్ సాయిల్’ పేరుతో ఓ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన ఆయన లండన్ నుంచి భారత్ వరకు 27 దేశాల మీదుగా బైక్ మీద పర్యటిస్తూ ప్రజల అవగాహన పెంచేందుకు కృషి చేశారు. ఇప్పటి వరకు 74 దేశాల్లో 2.3 బిలియన్ల ప్రజలు సేవ్ సాయిల్ ఉద్యమానికి గళం కలిపారని ఆయన వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన జగ్గీవాసుదేవ్, మట్టిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. మట్టి పునరుత్పత్తి జరగాల్సిన అవసరముందని చెబుతూ తాము కనీసం 3.6 బిలియన్ల ప్రజలతో సేవ్ సాయిల్ గురించి మాట్లాడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచంలో ఆహార భద్రత గురించి ఆలోచించటం మొదలయిందని, చాలా దేశాల్లో ఆహార భద్రత కోసం బంజరు భూములను వ్యవసాయ భూములుగా మారుస్తున్నారని అన్నారు. మన దేశంలో వ్యవసాయ భూములను బంజరు భూములుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పంటల్లో రసాయన ఎరువుల వాడకానికి బదులుగా సేంద్రీయ పదార్థాల వాడకం పెరగాలని ఆయనన్నారు. కార్బన్ క్రెడిట్ సిస్టంను రైతులకు అనుకూలంగా మార్చాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. సేంద్రియ వ్యవసాయం పేరుతో, ఎరువుల వినియోగం ఒక్కసారిగా తగ్గిస్తే, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోందని, అందుకే క్రమక్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. జర్మనీ, భారత్, ఫ్రాన్స్ దేశాల్లో మినహా మరెక్కడా సాయిల్ హెల్త్ కార్డ్ విధానం లేదని అన్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ పదం మార్కెటింగ్ వస్తువుగా మారిందని వ్యాఖ్యానించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో ప్రజల్లో మార్పురానంత వరకు, ఎన్ని చట్టాలు తెచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. చిన్న, మధ్య తరగతి రైతులకు సేంద్రీయ వ్యవసాయం విషయంలో ప్రోత్సాహకాలు అవసరమని జగ్గీవాసుదేవ్ అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోడీ సహకారం బాగుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.